- ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఇసికి అందచేశాం
- సీరియల్ నంబర్లను కూడా ఇచ్చేశాం
- మా దగ్గర ఇంకే వివరాలు దాచలేదు
- సుప్రీంకోర్టులో ఎస్‌బిఐ అఫిడవిట్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నుంచి మందలింపును ఎదుర్కొన్న తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బిఐఇ) గురువారం ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దాతల నుంచి విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీలను గుర్తించే ఎన్నికల బాండ్లకు చెందిన అన్ని సీరియల్ నంబర్లు కూడా ఎస్‌బిఐ మసర్పించిన వివరాలలో ఉన్నాయి. ఈ మేరకు ఎస్‌బిఐ గురువారం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించామని, కంప్లీట్ అకౌంట్ నంబర్లు, కెవైసి వివరాలు తప్ప తమ వద్ద వేరే వివరాలేవీ ఉంచుకోలేదని ఎస్‌బిఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎస్‌బిఐ అందచేసిన వివరాలను ఎన్నికల కమిషన్ మరి కొద్ది గంటల్లో తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నది.
కాగా..ఎస్‌బిఐ ఇదివరకు ఎన్నికల మిషన్‌కు ఎన్నికల బాండ్లకు సంబంధించి రెండు జాబితాలను అందచేసింది. మార్చి 14న వీటిని ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. మొదటి జాబితాలో దాతల పేర్లు, బాండ్ల విలువ, వాటిని కొనుగోలు చేసిన తేదీలు ఉన్నాయి. రెండవ జాబితాలో రాజకీయ పార్టీల పేర్లు, బాండ్ల విలువ, వాటిని ఎన్‌క్యాష్ చేసుకున్న తేదీలు ఉన్నాయి. బాండ్లపై ఉన్న యూనిక్ అల్ఫాన్యూమరిక్ కోడ్(సీరియల్ నంబర్లు) వివరాలు లేకుండా ఏ రాజకీయ పార్టీకి ఏ దాత విరాళం అందచేశారో గుర్తించడం చాలా కష్టం. అల్ట్రావైలెట్ లైట్‌ని ఉపయోగించి మాత్రమే అల్ఫాన్యూమరిక్ కోడ్‌ను చూడగలం. మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా సీరియల్ నంబర్లతోసహా బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని ఎస్‌బిఐని సుప్రీంకోర్టు గత సోమవారం ఆదేశించింది.
అంతేగాక తాము పూర్తి వివరాలను వెల్లడించామని తెలియచేస్తూ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఎస్‌బి చైర్ పర్సన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన అసమగ్ర సమాచారాన్ని ఎస్‌బిఐ అందచేసిందని ఫిర్యాదు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. మీ వద్ద ఉన్న ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు మాకు కావాలి. మీకేం కావాలో చెబితే అది వెల్లడిస్తాం అన్నట్లు ఉంది ఎస్‌బిఐ వ్యవహార శైలి. అది మంచి పద్ధతి కాదు. మేము అన్ని వివరాలు అందచేయాలి అంటే దాని అర్థం మీ వద్ద ఉన్న అన్ని వివరాలు అని. ఏ వివరాలను దాచలేదు అని నుంచి అఫిడవిట్ కూడా కావాలి అని సిజెఐ చంద్రచూడ్ గత సోమవారం ఎస్‌బిఐని ఉద్దేశించి హెచ్చరించారు. ఎస్‌బిఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖేరా పేరిట గురువారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ కింద వివరాలను మరోసారి సమర్పిస్తున్నామని పేర్కొంది. బాండు కొనుగోలుదారుడి పేరు, బాండు డినామినేసన్, స్పెసిఫిక్ నంబరు, బాండును ఎన్‌క్యాష్ చేసుకున్న పార్టీ పేరు, రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతా నంబరు చివరి నాలుగు అంకెలు, ఎన్‌క్యాష్ చేసుకున్న బాండు డినామినేషన్, నంబరు.