ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఆయనపై ఎటువంటి బలవంతపు చర్య లేదా అరెస్టు వంటివాటి నుంచి రక్షణ కల్పించడం కుదరదని ధర్మాసనం తెలిపింది. లిక్కర్ కేసులో తనకు సమన్లను సవాలు చేస్తూ కేజ్రీవాల్ పెట్టుకున్న ప్రధాన పిటిషన్ విచారణ ఎప్రిల్ 22న జరుగుతుంది. అరెస్టు విషయంలో పరిశీలనకు అప్పుడు వీలవుతుందని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్, మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల వాదనలు వినడం జరిగిందని , ఇప్పటికైతే పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ విషయంలో ఎటువంటి ఉత్తర్వు ఇవ్వడం లేదని , దీనిపై పిటిషనర్ జవాబు ఇచ్చుకోవచ్చునని ధర్మాసనం తెలిపింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కావాలని కోరడం, సమన్లను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పరిధిలోకి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
గురువారం తమ ముందుకు రావాలని ఇడి కేజ్రీవాల్‌కు తొమ్మిదో సారి సమన్లు పంపించింది. ఇప్పటి సమన్లను నిలిపివేయాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని ఇడి తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వ్యతిరేకించారు. ఆయనకు ఇచ్చిన గడువు అయిపోయిందని, ఈ రోజు హాజరు కావల్సి ఉందని , రాలేదని తెలిపారు. వాదనలు తరువాత ధర్మాసనం తాము పిటిషనర్ విషయంలో ఇప్పుడు చేసేది ఏమి లేదని, తదుపరి విచారణ దశలో దీనిపై పరిశీలనకు అవకాశం ఉంటుంది. అయినా అప్పుడు పూర్తి స్థాయిలో సమన్ల చట్టబద్ధత విషయం ప్రస్తావనకు వస్తున్నందున అప్పుడే దీనిని కూడా నిర్థారించుకునేందుకు వీలుందని తెలిపారు. కాగా గురువారం సమన్లకు కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం, తదుపరి పరిణామాలపై ఇడి తదనంతర చర్యలు ఏమిటనేవి తెలియలేదు.