Monday, December 23, 2024

సుదీర్ఘ ఎన్నికలతో ప్రతిపక్షాలకు నష్టం

- Advertisement -
- Advertisement -

డబ్బు, ప్రచారంలో వెనుకబడిపోతాం
అన్ని పార్టీలకూ సమాన అవకాశాలు ఏవీ
ఎన్నికల కమిషన్ వివేచననే ప్రశ్నిస్తున్నాం
1952 తర్వాత సుదీర్ఘంగా జరుగుతున్న ఎన్నికలు ఇవే
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సుదీర్ఘకాలం జరుగుతున్న రెండవ ఎన్నికలైన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ప్రత్రిపక్షాలకు ప్రతికూలంగా మారాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే సంపూర్ణ హక్కు ఎన్నికల కమిషన్‌కే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న వివేచననే తాము ప్రశ్నిస్తున్నామని పిటిఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన అన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు 82 రోజుల పాటు జరగనున్నాయి.

మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ జూన్ 4న ఫలితాల వెల్లడితో ముగియనున్నది. ఇంత సుదీర్ఘ కాలం ఎన్నికలు జరగడం గురించి ప్రశ్నించగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రక్రియపై సర్వాధికారాలు ఎన్నికల కమిషన్‌కే రాజ్యాంగం కల్పిస్తోందని, దీన్ని తాము కూడా గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే దీని వెనుక ఉన్న వివేచననే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. సాంకేతికంగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న కాలంలో ఎన్నికల నిర్వహణ తగ్గాల్సింది పోయి పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పురుడుపోసుకున్న రోజుల్లో తొలి లోక్‌సభ ఎన్నికలు 1952లో సుదీర్ఘకాలం పాటు జరిగాయని, ఆ తర్వాత అంత అత్యధిక రోజులు ఎన్నికలు జరుగుతున్నది ఇప్పుడేనని ఆయన తెలిపారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ తగ్గడానికి బదులు పెరిగిందని ఆయన తెలిపారు. దీని వల్ల ఎన్నికలలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు దక్కబోవని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బు, ప్రచారం విషయంలో ప్రతిపక్షాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. భౌతిక ప్రచారం విషయంలో అధికార పక్షానికి ఉన్న సానుకూల పరిస్థితులు ప్రతిపక్షాలకు ఉండవని ఆయన చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఒక దశ నుంచి మరో దశకు వేగంగా కదలిపోగలరని, గతంలో ప్రచారం తర్వాత ఓటింగ్ జరిగేదని, కాని ఇప్పుడు ఒక దశ తర్వాత మరో దశగా వరుసగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఒక దశలో పోలింగ్ జరుగుతుంటే మరో దశలో ప్రచారం జరుగుతుంటుందని, ప్రధాని, కేంద్ర మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమకు ఉన్న ఆర్థిక బలంతో వేగంగా ఒక చోటు నుంచి మరో చోటికి కదులుతూ ప్రచారంలో చెప్పే మాటలు పోలింగ్ జరిగే వేరే చోట కూడా ప్రసారం అవుతుంటాయని ఆయన తెలిపారు. దీని వల్ల అధికార పార్టీకే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా అని ఏచూరి ప్రశ్నించారు. పోలింగ్ జరిగే నియోజకవర్గంంలో 48 గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని, కాని వేరే చోట ప్రచారం కొనసాగుతుండడం కోడ్ ఉల్లంఘన కాదా అని ఆయన ప్రశ్నించారు. బిజెపి బలహీనంగా కేడర్ బలం అంతగా లేని రాష్ట్రాలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కేడర్‌ను తరలించేందుకు ఏడు దశల పోలింగ్ అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. ఏ రకంగా చూసిన ఇంత సుదీర్ఘ ఎన్నికల వల్ల ప్రతిపక్షాలకు ప్రతికూల పరిస్థితులే అధికంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

డబ్బు, ప్రజలకు చేరువ కావడంలో అధికార పక్షానికే ఎక్కువ అనుకూలత ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తు త లోక్‌సభ ఎన్నికలు 44 రోజులకు పైగా జరగనున్నాయి. 1951-52 నాటి లోక్‌సభ ఎన్నికలు నాలుగు నెలలకు పైగా జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా పరిగణించే భారత పార్లమెంటరీ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటనతో ముగియనున్నాయి. కాగా..ఎన్నికల షెడ్యూల్ విడుదల సందరగా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ సెలవులు, పండుగలు, పరీక్షలు వంటి అంశాల ప్రాతిపదికన నిర్ణయించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News