Saturday, November 23, 2024

సమగ్ర భూసంస్కరణలెప్పుడు?

- Advertisement -
- Advertisement -

వలస పాలనలో గ్రామీణ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలితంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, భూస్వామ్య విధానం, ధనిక రైతాంగ ఒక కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవసాయం మొలకెత్తి వృద్ధి చెందడానికి, ఉత్పత్తి విధానం తగినంతగా మార్పు చెందకపోవడంతో పెట్టుబడిదారీ వ్యవసాయానికి బదులు సంకర రూపాలు ఏర్పడ్డాయి. వలస పూర్వపు రోజుల నుండి ఇప్పటి వరకు భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామాలను అధ్యయనం చేస్తే వ్యవసాయంలో మార్పులు సంభవించాయని చెప్పడం సరైందే.ఈ మార్పులను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధం అభివృద్ధి చెందినట్లు పొరపాటుగా భావించడం గతంలోనూ అనేక సార్లు జరిగింది. వ్యవసాయంలో సామ్రాజ్యవాద చొరబాటును సులభతరం చేసేందుకు 1970లో భారత ప్రభుత్వం ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగానికి కొన్ని వసతులు కల్పించింది. బడా భూస్వామ్య వర్గానికి నష్టం జరగకుండా గ్రామీణ, పట్టణాల్లో చర్యలు తీసుకుంది.

ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరుతో బడా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ ప్రక్రియ ఉప ఉత్పత్తిగా మాత్రమే వ్యవసాయంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకు కొంత దోహదపడింది. అయితే ఇది పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని తీసుకుని రాలేకపోయింది. అనేక మంది వ్యవసాయ ఆర్ధిక వేత్తలు ఈ వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధ పరిమితులను, వైఫల్యాలను గుర్తించడంలో విఫలమయ్యారు. భారత వ్యవసాయాన్ని సరిగా అధ్యయనం చేస్తే అందులో పెట్టుబడిదారీ అభివృద్ధి ప్రధాన ధోరణిగా గాని, పెరుగుతున్న ధోరణిగా లేదు. ప్రస్తుత సామ్రాజ్యవాదం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నయావలస పరివర్తన వైపుకి లాగుతున్నది. భారత దేశంలో ఉన్న దాని మిత్రవర్గాలతో కుమ్మక్కైన ఫైనాన్స్ పెట్టుబడి, ఆ మిత్రుల సహకారంతో వ్యవసాయ ఉత్పత్తులపై అంతకంతకూ ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తున్నది. హరిత విప్లవ ఆరాధకులు దీనిని చూడడంలో విఫలమవుతున్నారు.

పరిణామాల ఫలితాన్ని నిర్ధారించే నిర్ణయాత్మకశక్తి వర్గపోరాటం మాత్రమేనని, వర్గాలుగా విభజించబడిన సమాజ పరిణామ చరిత్ర చాటి చెబుతున్నది. సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థ చొరబాటుకు వీలుగా తెరుచుకొన్న నేటి భారత సామాజిక వ్యవస్థలో ఒక వైపుకు లాగుతున్నది. భారత అర్ధ భూస్వామ్య విధానంలో ఇప్పటివరకు భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకోలేదు. భూకేంద్రీకరణలో తీవ్ర అసమానతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేశంలో 13.8%గా వున్న భూకామందుల వద్ద మొత్తం భూమిలో 47.3% భూమి ఉంది. 4.9%గా వున్న పెద్ద భూస్వాముల వద్ద మొత్తం భూమిలో 32% భూములు వున్నాయి. 84% గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు 47% భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. వ్యవసాయ పరికరాల్లో కూడా తీవ్ర వ్యత్యాసం ఉంది. 25 ఎకరాలు పైబడిన కమతాలు గల ప్రతి 100 కుటుంబాలకు 38 ట్రాక్టర్లు ఉన్నాయి. 10 నుండి 25 ఎకరాల లోపు భూ కామందుల ప్రతి వంద కుటుంబాలు 18 ట్రాక్టర్లు వున్నాయి.

ఒక ఎకరం నుంచి 5 ఎకరాలు కలిగి ప్రతి 100 చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు ఒక ట్రాక్టర్ మాత్రమే వున్నాయి. కోత మిషన్లు, నాట్ల యంత్రాలు సంపన్న భూకమతాల రైతులే కలిగి ఉన్నారు. బ్యాంకు రుణాలను కూడా వీరే అత్యధికంగా పొందుతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ట్రాక్టర్లు, యంత్రాలు పొంద గలిగే పరిస్థితి లేదు. బ్యాంకు రుణాలు కూడా చాలా తక్కువ మంది పొందగలుగుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవసాయంలో భూమి కొద్ది మంది వద్ద పోగుబడి వేల ఎకరాల భూఎస్టేట్‌దారులుగా మారతారు. చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోయి భూఎస్టేట్లలో కూలీలుగా మారతారు. పంటలు ప్రజల అవసరాల కోసం కాకుండా వ్యాపార సరళిలో పండిస్తారు. ఏ పంట వలన ఎక్కువ లాభం వస్తుందో ఆ పంటనే పండిస్తారు. పంట అమ్మకాల ద్వారా వచ్చే మిగులును భూఎస్టేట్‌ను విస్తరించటానికి తిరిగి పెట్టుబడిగా మారుస్తారు.ఇదే పెట్టుబడిదారీ వ్యవసాయం. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్నది ఈ పెట్టుబడిదారీ వ్యవసాయమే.

సేద్యంలో వచ్చిన కొన్ని మార్పులను ఎవరూ నిరాకరించరు. రైతాంగం కుటుంబ అవసరాల రీత్యా మిగులు ఆదాయం కోసం పంట దిగుబడులను పెంచే ఆలోచన చేయడం, ఎరువుల వినియోగం పెంచడం, సేద్యంలో ట్రాక్టర్లు, కోత మిషన్లు, నాట్ల యంత్రాలు రావడం సేద్యంలో వచ్చిన మార్పులుగా వున్నాయి. ఈ మార్పులేవీ వ్యవసాయాన్ని పెట్టుబడిదారీ వ్యవసాయంలోకి మార్చలేకపోయాయి. భారత దళారీ బూర్జువా వర్గం పూర్తి చేయని బూర్జువా ప్రజాతంత్ర విప్లవాన్ని నేడు నూతన ప్రజాతంత్ర విప్లవం ద్వారా అర్ధ వలస, -అర్ధ భూస్వామ్య వ్యవస్థను సమూలంగా మార్చి, విప్లవ భూసంస్కరణల ద్వారా పేదలకు భూ పంపిణీ జరిగినప్పుడే, భూకేంద్రీకరణ బద్దలవుతుంది. సోషలిస్టు వ్యవస్థలో ఏర్పాటు అయ్యే సమష్టి వ్యవసాయ క్షేత్రాల ద్వారా మాత్రమే సేద్యం పారిశ్రామికవంతం అవుతుంది. అందుకోసం రైతాంగం ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News