రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు టూవీలర్ ను బయటకు తీయాలంటేనే భయపడే రోజులు దాపురించాయి. కిక్కిరిసిపోయే బస్సుల్లో వెళ్లలేక, ద్విచక్రవాహనాలపై తిరగలేక వారు పడే బాధ వర్ణనాతీతం. అయితే ఈ కష్టాలకు చెక్ చెప్పే రోజులు మరెంతో దూరంలో లేవు.
ప్రముఖ కంపెనీ బజాజ్ ఆటో ఓ టూవీలర్ ను రూపొందించింది. దీన్ని నడిపేందుకు పెట్రోల్, విద్యుత్ అక్కర్లేదు. ఇది సిఎన్ జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)పై నడుస్తుంది. ఇప్పటికే సిఎన్ జీ ఇంజన్లతో రూపొందిన కార్లు మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. పెట్రోల్ తో పోలిస్తే సిఎన్ జి ధర తక్కువ. పైగా ఇది ఇచ్చే మైలేజీ చాలా ఎక్కువ. దీంతో బజాజ్ ఆటో సిఎన్ జి బైక్ లపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఒక టూవీలర్ ను తయారు చేసి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అన్నీ సానుకూలంగా ఉంటే బజాజ్ సిఎన్ జీ టూవీలర్లు ఈ ఏడాది జూన్ నెలలో మార్కెట్లోకి రావచ్చు.
సిఎన్ జీ టూవీలర్ కనీసం 80 కి.మీ. మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. సిఎన్ జీ కార్లకు ఉన్నట్లే ఈ బైక్ కూడా డ్యూయల్ ఫ్యుయల్ పై ఆధారపడి పనిచేస్తుంది. అంటే, బైక్ ను పెట్రోల్ లోనూ, సిఎన్ జీలోనూ కూడా నడుపుకోవచ్చు. ఇలా మార్చుకునేందుకు ఒక బటన్ ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 85 వేలు ఉండవచ్చని అంచనా.