అరెస్ట్‌లతో పాటు ఆస్తులు సీజ్
యాంటీ నార్కెటిక్స్ బ్యూరో వెల్లడి
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడే నేరగాళ్లను అరెస్ట్ చేయడమే కాదు, వారి ఆస్తుల్ని సైతం సీజ్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వెల్లడించింది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రవాణా కేసులు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పట్టుబడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా దందా ఆగిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రధానంగా దీనిని ఓ ఆదాయవనరుగా భావిస్తూ యువతే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఈ డ్రగ్స్‌ను ఇక్కడ ఐదారు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. ఇటీవల ముషీరాబాద్‌కు చెందిన డ్రగ్స్ విక్రేత సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కేవలం డ్రగ్స్ విక్రయాల ద్వారా కోటి విలువైన కారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గతేడాది ఆల్ఫ్రాజోలం విక్రయిస్తూ పట్టుబడ్డ అబ్కారీ శాఖ కానిస్టేబుల్ రమేశ్, రంగారెడ్డి జిల్లాకు వెంకటయ్యలు 23 కోట్ల స్థిర, చరాస్థులు కూడగట్టినట్లు టీఎస్ న్యాబ్ గుర్తించింది.
ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతేడాది ఆగస్టులో 44 కిలోల గంజాయితో వీరన్న, మధు, ప్రశాంత్ అనే ముగ్గురు వ్యక్తులను టిఎస్ న్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 96.55 లక్షల స్థిర, చరాస్థులను జప్తు చేశారు. ఇటీవల నానక్‌రాంగూడలో గంజాయి విక్రయిస్తున్న నీతూబాయి ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు 4 కోట్ల ఆస్తుల్ని ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి మార్పు రాకపోవడంతో…
నిందితులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినా మార్పురావడం లేదు. ఇలాంటి కేసుల్లో ఏళ్ల తరబడి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్‌వ్యవస్థ ఎన్‌డిపిఎస్ చట్టాన్ని వినియోగించి నేరగాళ్ల ఆట కట్టిస్తోంది. ఇకనుంచి మత్తు పదార్థాల విక్రయాలు జరిపినట్లయితే ఈ చట్టం ప్రకారం నిందితుల ఆస్తులు జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. నిందితుల అక్రమ ఆస్తులపై ఆధారాలతో సహా చెన్నైలోని ’సఫేమా’ కార్యాలయానికి నివేదికను పంపిస్తారు. దీన్ని సఫేమా లోతుగా పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే ఆస్తులు జప్తు చేస్తారు.