Sunday, January 19, 2025

ఇడి కస్టడీకి కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

28 వరకు కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు

ఇరుపక్షాల వాదనల అనంతరం జడ్జి రూలింగ్

సిఎం పదవితో లిక్కర్ దందా

సౌత్ గ్రూపు నుంచి కవిత ద్వారా రూ.100 కోట్లు

కోర్టులో ఇడి వాదనలు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్టు అయిన కేజ్రీవాల్‌కు స్థానిక ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఏడురోజుల ఇడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు వెలువరించింది. శుక్రవారం రాత్రి ఈ రూలింగ్ ప్రకటించారు. స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇడి, కేజ్రీవాల్ లాయర్ల నడుమ తీవ్రస్థాయి వాదోపవాదాల తరువాత ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తమ ఆదేశాలు వెలువరించారు. వాదనల దశలో ఇడి కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. లిక్కర్ సిండికేట్ పుట్టడానికి, లంచాలు వ్యవహారం తలెత్తడానికి మూలసూత్రధారి కేజ్రీవాల్ అని తెలిపింది. ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన తన హయాంలో లిక్కర్ ద్వారా మోసాలకు పాల్పడే వలయం సృష్టించారని , తన పదవిని అడ్డుపెట్టుకుని , ఆప్ పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమ లావాదేవీలు సాగించేందుకు వీలు కల్పించారని, బాధ్యతాయుత సిఎం పదవిని దుర్వినియోగపర్చారని పేర్కొంటూ , మరింతగా నిజాలు రాబట్టుకోవడానికి పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించింది. కాగా వాదనల తరువాత కొద్ది సేపు విరామానంతరం కోర్టు తన ఆదేశాలు వెలువరించింది.

ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనను కస్టడీలోకి తీసుకోవచ్చునని, కాగా అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తమ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ఒక్కరోజు క్రితమే ఇడి వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కేసులో కేజ్రీవాల్ కింగ్‌పిన్ అని ఇడి పేర్కొంది. సౌత్ గ్రూప్ , ఇతర నిందితులు మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఆప్ అధికారి విజయ్ నాయర్‌కు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తి లేదా దళారిగా వ్యవహరించారని కూడా పేర్కొంది. ఈ స్కాం మొత్తం విలువ రూ 600 కోట్లు దాటింది. ఇందులో రూ 100 కోట్లు సౌత్ గ్రూప్ కేజ్రీవాల్‌కు చెల్లించిందని తెలిపారు. వందకోట్లు కేజ్రీవాల్‌కు బిఆర్‌ఎస్ నేత , ఎమ్మెల్సీ కె కవిత ద్వారా అందాయని , ఆమెను గతవారం అరెస్టు చేశామని ఇడి వివరించింది. నిజానిజాలు తేల్చుకునే దశ కీలక స్థాయికి చేరిందని, ఇప్పుడు కేజ్రీవాల్‌ను కనీసం పది రోజులు తమ కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. ఈ పలు ప్రకంపనల స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు. ఇందులో ఆప్ నేతలు, మంత్రులు రింగ్‌గా చేరారు. పలు ఇతరత్రా విషయాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు తాము ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కస్టడీకి తీసుకునేందుకు అనుమతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇడి తరఫున ప్రత్యేక న్యాయవాదులతో పాటు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు కోర్టుకు విన్నవించుకున్నారు.

కాగా తనను ఇడి అరెస్టు, కస్టడీ పరిధి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ తన లాయర్ల ద్వారా శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీనితో ట్రయల్ కోర్టులోనే ఆయనపై విచారణ జరిగింది. గట్టి భద్రత నడుమ కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ విషయంపై వాదోపవాదాలు జరిగాయి. రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట ఇడి తన వాదనలు ఘాటుగా విన్పించింది. 202122 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని అమలుకు సౌత్ గ్రూప్ పేరిట ఓ సిండికేట్ తెరవెనుక పైరవీలకు దిగింది. వీరి నుంచి కేజ్రీవాల్‌కు అనేక కోట్లు ముడుపులు పాలసీ అమలుకోసం ముట్టాయని ఇడి పేర్కొంది. ఇవన్నీ కిక్‌బ్యాక్‌లే అని తెలిపింది. ఇక పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ రూ 100 కోట్ల ముడుపులు డిమాండ్ చేశాడని అదనపు సొలిసిటర్ జనరల్ తెలియచేశారు. ఇడి తరఫున ఆయన తమ వాదనలు విన్పించారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడ్డ నిందితుల నుంచి తీసుకున్న వివరాలు, దొరికిన సాక్షాధారాల క్రమంలో తమకు అన్ని వివరాలు తెలిశాయి.

కేజ్రీవాల్ ప్రధాన కేంద్ర బిందువుగా ఈ స్కామ్ సాగిందని నిర్థారణ అయిందని, ఈ నిజాలను మరింతగా ఖాయం చేసుకోవాలంటే ఈ ప్రధాన సూత్రధారుడిని తమ కస్టడీకి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. కనీసం పది రోజులు ఇది తప్పదని స్పష్టం చేశారు.కేవలం కొందరి వాంగ్మూలాలే కాకుండా తమకు దొరికిన కాల్ డిటేల్స్ రికార్డులు (సిడిఆర్) వల్ల దొరికిన సమాచారం కేజ్రీవాల్ పాత్రను తేటతెల్లం చేశాయని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. అంతకు ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పదిరోజులు కేజ్రీవాల్ రిమాండ్ కావాలనే తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలిపారు. ఆప్ కేవలం ఓ వ్యక్తి కాదని, ఓ పార్టీ పైగా కంపెనీగా మారింది, దీని నిర్వహణ బాధ్యతలు దీనిలోని ప్రతి ఒక్కరి పైనా ఉంటాయన్నారు.
ఇది దారుణం : సింఘ్వీ
కాగా ఇడి వాదనను ఆప్ నేత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ పూర్తిగా వ్యతిరేకించారు. దేశ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరగని విధంగా ఓ సిట్టింగ్ సిఎంను అరెస్టు చేశారని, ఇది దారుణం అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News