Friday, December 20, 2024

కన్జర్వేషన్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

చోద్యం చూస్తున్న రెవెన్యూ, హెచ్‌ఎండిఎ, స్థానిక సంస్థల అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు మార్పు చేయాలంటూ గత ప్రభుత్వానికి సిఎల్‌యూ కింద (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్) కింద దరఖాస్తులు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్‌ఎండిఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఉండగా 41 శాతం వ్యవసాయం మాత్రమే చేయాలన్న తలంపుతో కొన్నింటిని కన్జర్వేషన్ జోన్‌లుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఓపెన్ స్పేస్ జోన్‌లో కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇదే అదునుగా కొందరు రియల్టర్‌లు కన్జర్వేషన్ జోన్‌లోనూ అనుమతులు లేకుండా విల్లాలు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలను చేపడుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు మెరుగైన అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్ 2031 ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండిఏ విస్తరించి ఉన్న 7,257 కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లోని 70 మండలాల్లోని ప్రతి సర్వే నెంబర్‌ను మాస్టర్‌ప్లాన్‌లోని ఓ జోన్ కిందకు తీసుకొచ్చారు. హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ (కన్జర్వేషన్) జోన్, రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, మాన్యుఫాక్చరింగ్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఓపెన్ స్పేస్ జోన్, రీక్రియేషన్ జోన్ ఇలా 12 జోన్‌లను 21 రకాలుగా విభజించారు. మాస్టర్‌ప్లాన్ 2031లో ఏ జోన్ కింద నిర్ణయించారో ఆ ప్రకారంగానే సంబంధిత సర్వే నెంబర్‌లలో ఉన్న స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అధికారులు వాటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. మాస్టర్‌ప్లాన్‌ను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా జోన్ మార్పును సంబంధిత శాఖ మంత్రి ఆమోదం ప్రకారం చేసుకోవచ్చన్న నిబంధన కూడా ఉంది. ఆ మేరకు హెచ్‌ఎండిఏ మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించిన వివిధ జోన్లను మార్పు చేస్తూ హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం కొన్ని జోన్‌లను మార్పు చేయడంతో కొందరు రియల్టర్లు తక్కువ ధరకే భూములు వస్తున్నాయంటూ ఆ జోన్‌ల పరిధిలో వందలాది ఎకరాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఆ భూముల్లో వెంచర్లు చేస్తున్నారు. స్థానిక సంస్థలు, హెచ్‌ఎండిఏ, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టచెప్పి అనుమతులు లేకుండానే ప్లాట్లతో పాటు నిర్మాణాలను చేపట్టి యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఇలా పలు జిల్లాలోని కన్జర్వేషన్ జోన్‌లలో ప్లాట్లతో పాటు నిర్మాణాలను చేపడుతుండడం విశేషం. కన్జర్వేషన్ జోన్‌లో అనుమతులు లేకుండా విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కన్జర్వేషన్ జోన్‌లో ఉన్న వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ చేసి వాటిని ప్లాట్‌లుగా విభజించి కనీసం స్థానిక సంస్థల అనుమతులను తీసుకోకుండానే ఈ విక్రయాలు చేపడుతున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.
కన్జర్వేషన్ జోన్ నిబంధనలు ఇలా..
హెచ్‌ఎండిఏ 12 జోన్లలో కన్జర్వేషన్ జోన్ 41 శాతం పాత్ర పోషిస్తోంది. మాస్టర్ ప్లాన్ 7,200 చదరపు కి.మీ.లలో 2,421 చ.కి.మీ. కన్జర్వేషన్ జోన్‌గా ఉంటుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి ఈ ప్రాంతంలో చేయాల్సి ఉంటుంది. కన్జర్వేషన్ జోన్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లభించవు. ఈ ప్రాంతంలో హెచ్‌ఎండిఏ అనుమతులు రావు, లే ఔట్లు వేయకూడదు. పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీలకు మాత్రమే ఇక్కడ అనుమతులు లభిస్తాయి. రవాణా సదుపాయాలకు కూడా అనుమతులు ఇస్తారు. పరిశ్రమలు, ఇండ్ల నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వరు. ఈ నిర్మాణాలపై నిషేధం 100 శాతం ఉంటుంది. అయినా కొందరు రియల్టర్‌లు యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News