Friday, December 20, 2024

కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

కూతురును అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడని కెసిఆర్
కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తున్నామనడంలో మర్మమేమిటో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడలేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలని కేంద్రమంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక మతలబు ఏమిటో తెలంగాణ ప్రజలకు కెసిఆర్ చెప్పాలన్నారు. శనివారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవిత అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు, బిజెపికి, తెలంగాణకు, తెలంగాణ సెంటిమెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి చేసిన అవినీతికి సంబంధించి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్ర ఉంటనే ఈడీ అరెస్ట్ చేసిందని, ఆమెను దృష్టిలో పెట్టుకొని మద్యం కేసు దర్యాఫ్తు జరగలేదని వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాఫ్తు జరిగిందని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన రోజును చీకటి రోజు అని కెసిఆర్ చెబుతుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఎత్తుగడలు వేసిందన్నారు.
ముఖ్యమంత్రులు లిక్కర్ స్కాంకు పాల్పడితే బ్లాక్ డే అవుతుందా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి మా కుటుంబానికి సంబంధం లేదని, కేజ్రీవాల్‌కు, ఆ ప్రభుత్వానికి కూడా ఈ కుంభకోణంతో సంబంధం లేదని మాజీ కెసిఆర్ అని నిలదీశారు. తాను సవాల్ చేస్తున్నానని మద్యం వ్యవహారంలో ఆప్ అవినీతికి పాల్పడిందని, వందల కోట్లు చేతులు మారాయని దీనిని నేను ఆధారాలతో నిరూపిస్తాను కెసిఆర్ కాదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్దకు వస్తావా ప్రెస్ క్లబ్ వద్దకు వస్తావా చెప్పాలన్నారు. అయినా మద్యం అంశంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చించడం తమకు ఇష్టం లేదన్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్‌ను దేశ ప్రజలు సమర్థిస్తున్నారు: 
బీరు, బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనం దోపిడీ చేస్తే అందుకు అరెస్ట్ చేస్తే అక్రమం ఎలా అవుతుందో చెప్పాలన్నారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో దోచుకోవాలని భావించారని ఆరోపించారు. బిఆర్‌ఎస్, ఆప్ నేతలు సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సామాన్య ప్రజలు, విజ్ఞులు, మేధావులు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టును అందరూ సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందని పలికారని మద్యం అక్రమాలు చూస్తే అది నిజమే అనిపిస్తోందన్నారు. ఇక్కడ కెసిఆర్ ఆచరిస్తే కేజ్రీవాల్ అనుసరించారని ఎద్దేవా చేశారు. ఆప్, కవిత చేసిన కుట్రలకు బిజెపిని విమర్శించడం సరికాదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తన కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం లేదని కెసిఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ కేసులో పలువురు నిందితులు అప్రూవర్‌గా మారినట్లు చెప్పారు. ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్‌లో డొంక కదిలిందని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News