ఐఎస్‌ఐఎస్ (ఐసిస్)కు విధేయత ప్రకటించినట్లుగా భావిస్తున్న ఒక ఐఐటి గువాహటి విద్యార్థిని అస్సాంలోనిహాజోలో శనివారం అరెస్టు చేశారు. తాను ఆ ఉగ్రవాద సంస్థలో చేరాలని భావిస్తున్నట్లు నాలుగవ సంవత్సరం బయోటెక్నాలజీ విద్యార్థి ఇటీవల ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోను, ఇమెయిల్స్‌లోను ప్రకటించాడు. అతను ఐఐటి గువాహటి క్యాంపస్ నుంచి కనిపించకుండా పోయాడు. అతనిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద అభియోగాలు నమోదు చేశారు. అతనిని ఆదివారం గువాహటిలో ఒక కోర్టుకు తీసుకువెళ్లారు. కోర్టు అతనిని పది రోజులు పోలీస్ కస్టడీకి పంపింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించిన
తరువాత ధుబ్రి జిల్లాలో ఐసిస్ ఇండియా అధిపతి హారిస్ ఫరూఖి అరెస్టు జరిగిన కొన్ని రోజులకే తాజా అరెస్టు చోటు చేసుకుంది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, ఢిల్లీ వాసి అయిన విద్యార్థి తన నిర్ణయానికి కారణం వెల్లడిస్తూ లింక్డ్ ఇన్‌లో ఒక బహిరంగ లేఖ రాసిన తరువాత అతని కోసం లుకౌట్ అలర్ట్ జారీ అయింది. గువాహటికి 30 కిలో మీటర్ల దూరంలో కామ్‌రూప్ జిల్లా హాజోలో అతను కనిపించాడు. దర్యాప్తు నిమిత్తం అతనిని నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసులు ఐఐటి గువాహటి అధికారులను సంప్రదించినప్పుడు ఆ విద్యార్థి మధ్యాహ్నం నుంచి ‘అదృశ్యమైనట్లు’ అతని మొబైల్ ఫోన్ స్విచాఫ్ అయినట్లు అధికారులు తెలిపారు.