Friday, December 20, 2024

రాజ్యాంగాన్ని మార్చాలన్న అనంతకుమార్ హెగ్డేకు షాక్

- Advertisement -
- Advertisement -

ఉత్తర కన్నడలో అభ్యర్థిని మార్చేసిన బిజెపి అధిష్టానం

న్యూఢిల్లీ: పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రకటనలు చేసే నాయకులు ఎంతటివారైనా సహించేది లేదన్న సందేశాన్ని బిజెపి నాయకత్వం పంపిస్తోంది. తాజాగా బిజెపికి ఈ ఎన్నికల్లో 400పై చిలుకు స్థానాలు ఎందుకు అవసరమో తెలియచేస్తూ కర్నాటక నుంచి ఆరుసార్లు ఎంపిగా గెలిచిన సీనియర్ నేతకే బిజెపి అధిష్టానం చెక్ పెట్టింది. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి గత 28 ఏళ్లలో ఆరుసార్లు గెలుపొందిన అనంతకుమార్ హెగేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నుంచి నాయకత్వం చివరి నిమిషంలో తప్పించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు తప్పులు చేసే హెగ్డే ఈ నెల మొదట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి పెట్టుకున్న 400కి పైగా స్థానాల లక్షం ప్రధాన ఉద్దేశం రాజ్యాంగాన్ని మార్చడమేనని ఆయన ప్రకటించారు. హిందువులను అణచివేసేందుకే గతంలో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని హెగ్డే ఆరోపించారు. రాజ్యాంగాన్ని పునర్లిఖించాల్సిన అవసరం ఉందని ఆయన ఒక సభలో మాట్లాడుతూ అన్నారు. రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, గతంలో కాంగ్రెస్ అనవసర అంశాలను జొప్పిస్తూ రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా హిందువులను అణచివేసేందుకు అవసరమైన సవరణలు చేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం బిజెపికి ఉన్న బలంతో ఈ మార్పులు అసాధ్యమని ఆయన అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ లేకుండా పోతేనే ఇది సాధ్యమని, ప్రధాని మోడీకి లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ రావలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాజ్యసభతోపాటు రాష్ట్రాలలో కూడా బిజెపికి మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలని ఆయన చెప్పారు. బిజెపి ఎంపి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం ప్రకటించాయి. అయితే బిజెపి మాత్రం తమ ఎంపి వ్యాఖ్యలకు దూరం జరిగింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి పార్టీతో సంబంధం లేదని బిజెపి స్పష్టం చేసింది.ఈ వ్యాఖ్యలే అనంతకుమార్ హెగ్డే పాలిట శాపమయ్యాయి. ఆయన తన సీటును కోల్పోయేలా చేశాయి.

ఆయన చేసిన లాబీయింగ్ కూడా ఫలించలేదు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో అనంతకుమార్ హెగ్డే స్థానంలో ఆరుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విశ్వేశ్వ్రర్ హెగ్డే కగేరిని పార్టీ నాయకత్వం అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాగా..బిజెపి ఇప్పటి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పలుజాగ్రత్తలు తీసుకుంటోందనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఫైర్‌బ్రాండ్ నాయకురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేష్ బిధూరి, పర్వేష్ సాహిబ్ వర్మ సిట్టింగ్ ఎంపీలైనప్పటికీ తమ వివాదాస్పద ప్రకటనల ద్వారా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News