Monday, December 23, 2024

ఇక బిజెపికే టిటిడిపి మద్దతు !!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు పోటికి టి టిడిపి దూరమే??
ఏపిలో పార్టీ గెలిస్తే తెలంగాణలోనూ అలానే బిజెపితో ముందుకు…
ఏపి ఎన్నికల కోసం పయనమవుతున్న టి టిడిపి నేతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుతానికి తెలంగాణ టిడిపికి అధ్యక్షుడు లేని పరిస్థితి ఒక వైపు ఉండగా, మరో వైపు ఏపిలో అసెంబ్లీకి, లోక్ సభకు ఎన్నికలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపి ఎన్నికలకే పరిమితమవుతున్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే బిఆర్‌ఎస్‌లో చేరిపోగా ఆ స్థానాన్ని అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు భర్తీ చేయలేక పోయారు. ఏపి రాజకీయాలు కీలకం కావడంతో ఆయన ముందు ఏపిలో గెలిసి వద్దామని, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణపై దృష్టి సారిస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అటు ఏపిలో టిడిపితో బిజెపి జట్టు కట్టడంతో ఆ బంధం ఇక్కడ తెలంగాణలోనూ కొనసాగిస్తారా? లేక ఆ ఎన్నికల తర్వాత తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలా? అన్న దానిపై పార్టీ క్యాడర్‌కు ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎలాగూ ఏపిలో బిజెపితో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పార్టీకే ఓట్లు వేయించేందుకు ముందుకు వెళ్లడమే తమ ముందున్న కర్తవ్యమని టి టిడిపి నేతలు చెబుతున్నారు.

ఏపి ఎన్నికల నేపథ్యంలోనే…

కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏక కాలంలోనే లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండడంతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేవలం ఏపిపైనే దృష్టి సారిస్తున్నారు. జనసేన, బిజెపితో పొత్తుపెట్టుకుని ఏపిలో ఎలాగైనా అధికారంలోకి వచ్చే దిశగా పావులు కదుపుతున్న ఆ పార్టీ అధిష్టానం తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీపై ముందుకు వెళ్లలేక పోతోంది. ఈ క్రమంలో బిజెపితో పొత్తు తమకు కలిసి వస్తే భవిష్యత్తులో తెలంగాణలోనూ బిజెపితో కలిసి ముందుకు సాగుతామని మాత్రమే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఆరు మాసాలు గడిచినా ఇప్పటి వరకు ఆ స్థానం ఖాళీగానే ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. నేడు లోక్‌సభ ఎన్నికలు వచ్చినా టి టిడిపి మాత్రం పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతోంది. ఏపిలో తమ అధినేత చంద్రబాబు నాయుడు గెలిచాకే తెలంగాణపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయని..అప్పటిదాకా వేచి చూస్తామని కొందరు ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం.

ఏపి ఎన్నికల కోసం టిడిపి నేతలు

కాగా ఏపి ఎన్నికల ప్రచారం కోసం పలువురు తెలంగాణ టిడిపి నేతలు ఏపికి పయనమవుతున్నారు. ఇటీవల పలు జిల్లాలు పర్యటించిన అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపి ఆయన ప్రచార కార్యాక్రమాల్లో పాల్గొని వచ్చారు. తాజాగా మరో సారి ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనుటకు వెళ్లున్నారు. టిడిపి సీనియర్ నేతలు బక్కని నర్సింహులు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ కాట్రగడ్డ ప్రసూనతో పాటు మరింత మంది సీనియర్లు ఏపి ప్రచారంలో పాల్గొని వస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, ఆయన సతీమణి నారా భువనేశ్వరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్‌డియేదే అని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తుండడంతో తెలంగాణలోనూ బిజెపితో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ నేతలే చెబుతుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News