ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నోటీసులు?
టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్
నేతృత్వంలో పరికరాల కొనుగోలు..
ఇజ్రాయెల్ నుంచి దిగుమతి
సిఎం రేవంత్ ఇంటి సమీపంలో
కార్యాలయం, 300 మీటర్ల పరిధిలో
మాటలు వినేలా డివైస్‌ల ఏర్పాటు
నాగోల్ మూసీ వంతెన కింద
హార్డ్ డిస్క్ భాగాలు స్వాధీనం
ప్రణీత్‌రావు సహా ఇద్దరు అదనపు
ఎస్‌పిల కస్టడీ కోరుతూ నేడు
పోలీసుల పిటిషన్ ముగ్గురిని
కలిపి విచారించేందుకు కోర్టు
అనుమతి కోరే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలను ప్రశ్నించగా ఐపిఎస్ ప్రభాకర్ రావుతో పాటు మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముగ్గురు బిఆర్‌ఎస్ నేతల పేర్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఆ బిఆర్‌ఎస్ నేతలు ఎవరనేది అధికారులు బయటకి వెల్లడించలేదు. సదరు బిఆర్‌ఎస్ నేతలకు సెక్షన్ 41 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్యాప్ చేయాల్సిన విపక్ష నేతలు, వ్యాపారుల నెంబర్లు బిఆర్‌ఎస్‌లోని ఓ కీలక నే త భుజంగరావు, తిరుపతన్నలకు ఇచ్చేవారని, వారు ఈ నెంబర్లను ప్రణీత్ రావుకు చేరవేయగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు సదరు బిఆర్‌ఎస్ కీలక నేతకు డాటా ట్రాన్స్ ఫర్ చేసేవారని అధికారుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులోని పాత్రదారుల పేర్లు బయటపెట్టిన అధికారులు త్వరలోనే అసలు సూత్రదారుల పేర్లు కూడా బయటకు తీసే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్‌ఐబి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైస్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైస్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్‌ఐబి కోట్లలో డబ్బులు చెల్లిం చినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి అధునాతన డివైస్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైస్‌లను తెచ్చిన రవిపాల్, రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీసు తీసుకుని డివైస్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవం త్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరో వైపు, ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో పాటు నిం దితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ కోసం మంగళవారం పిటిషన్ వేయనున్నారు. ఈ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అటు, చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ వ్యవహారం సాగిందని ప్రణీత్ రావు విచారణలో చెప్పారని.. ఈ మేరకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ లను విచారించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, తొలుత ఎస్‌ఐబీ ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు.