చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇటు చెన్నై అటు గుజరాత్‌లు తమ తమ తొలి మ్యాచుల్లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. చెన్నై సొంత గడ్డపై బెబ్బులిలా ప్రత్యర్థిపై దాడి చేస్తుంది. చెపాక్ లో జరిగిన ఆరంభ పోరులోనూ చెన్నై.. బెంగళూరును చిత్తు చేసింది. అలాంటి చెన్నైపై గుజరాత్ ను గిల్ ఏమేరకు నడిపిస్తాడో చూడాలి.
గుజరాత్ తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిఛెల్, శివమ్ దూబె, జడేజా, ధోనీ తదితరులతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది తొలి మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు.
శివమ్ దూబె, జడేజాలు కూడా ధాటిగా ఆడారు. టాపార్డర్‌లోని ప్రతి బ్యాటర్ తనవంతు పాత్ర పోషించడంతో చెన్నై క్లిష్టమైన లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించింది. ఇక బౌలింగ్‌లో జడేజా పొదుపుగా బౌలింగ్ చేయగా, ముస్తఫిజుర్ రహ్మాన్ చెలరేగి పోయాడు. అద్భుత బౌలింగ్‌తో అలరించిన ముస్తఫిజుర్ నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా ముస్తఫిజుర్‌పై చెన్నైపై భారీ ఆశలు పెట్టుకుంది. జడేజా ఇటు బంతితో అటు బ్యాట్‌తో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. దీపక్ చాహర్, తీక్షణ, తుషార్ పాండే తదితరులతో చెన్నై బౌలింగ్ చాలా బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కూడా సిఎస్‌కె పటిష్టంగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం మరింత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఆత్మవిశ్వాసంతో టైటాన్స్..
మరోవైపు గుజరాత్ కూడా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ముంబైని ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. చెన్నైపై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, అజ్మతుల్లా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్‌లో జట్టుకు కీలకంగా మారాడు. మిల్లర్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే గుజరాత్‌కు ఎదురే ఉండదు. బౌలింగ్‌లోనూ గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, సాయి కిశోర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ వంటి మ్యచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో గుజరాత్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.