బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు
మంత్రి జూపల్లి సవాల్
ఎక్కడికి రమ్మంటే అక్కడికి
వస్తా ఎవరి ఫోన్లో ట్యాప్
చేయాలని చూశారు తప్ప
ప్రజలకు చేసిందేమీ లేదు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని దీనిపై హరీష్ రావు చర్చకు సిద్ధమా అని ఆయన ఛాలెంజ్ చేశారు. బిఆర్‌ఎస్ పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్‌లతో కలిసి మంత్రి జూపల్లి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలని చూశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. నివేదిక రాగానే పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇస్తామన్నారు. రైతుల బాగు కోరేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు, పదేళ్లలో మీరు ఏం చేశారని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వచ్చేవి కావన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అసలు హరీష్‌రావుకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి జూపల్లి గుర్తుచేశారు. తాము రైతులకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.1 లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో చెప్పాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.