రాగల రెండు రోజుల్లో 42డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మంగళవారం అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40నుంచి 42డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్ , జగిత్యాల, పెద్దపల్లి ,కరీంనగర్ ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ , భద్రాద్రి కొత్తగూడెం ,సూర్యాపేట , నల్లగొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, పగటి ఉష్ణోత్రలు గరిష్టంగా 42 డిగ్రీలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 41.1 డిగ్రీలు నమోదు కాగా, భద్రాద్రికొత్తగూడెం, కొమరంభీమ్ జిల్లాల్లో 40.8, అదిలాబాద్‌లో 40.7, నిజామబాద్‌లో 40.6, నిర్మల్‌లో 40.5, సూర్యాపేటలో 40.1డిగ్రీలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ , ఖమ్మం జిల్లాల్లో కూడా 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.