మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థలలో ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటంతో.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతోంది. మొత్తం 1,439 మునిసిపల్ వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వంటి స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులైన ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 1,000 మందిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలించినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బంధువు మన్నె జీవన్ రెడ్డిని కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టగా, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ ఎన్ నవీన్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు.