ఒక 30 ఏళ్ల మహిళతో గొడవపడి ఆమెను చితకబాది, వివస్త్రను చేసి, ఊరేగించినందుకు నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. హోలీ వేడుకల సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. గౌతమ్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోని బచ్చోరా గ్రామంలో సోమవారం తన ఇంట్లో ఉన్న ఒక మహిళను బలవంతంగా బయటకు ఈడ్చిన నలుగురు మహిళలు ఆమెను చితకబాది గామస్తులతంతా చూస్తుండగా వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారని జిల్లా ఎస్‌పి(గ్రామీణ) సునీల్ మెహతా తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.
బుధవారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్‌పి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాతంగా ఉందని తెలిపారు. అవమానభారతంలో ఉన్న బాధితురాలు తన పుట్టింటికి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. తన అత్తగారిని తనపైకి పురిగొల్పుతోందని బాధితురాలిపై నిందితులలో ఒక మహిళ అనుమానించినట్లు ఆయన చెప్పారు. తనకు చెప్పకుండా తన అత్తగారిని బాధితురాలు మాండ్‌సోర్‌కు తీసుకువెళ్లిందని ఆమె చెప్పినట్లు ఎస్‌పి తెలిపారు. బాధితురాలు, నిందితురాలు ఇద్దరూ ఎస్‌సి వర్గానికి చెందిన వారని ఆయన తెలిపారు. ఈ దారుణ ఘటనను గ్రామస్తులు కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, సర్కులేట్ చేసినట్లు తమక దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఆ నలుగురు మహిళల కాళ్లపై బడి క్షమించమని వేడుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారని ఎస్‌పి చెప్పారు. అయితే ఆ మహిళలు పెడచెవిన పెట్టడమే కాకుండా బహిరంగంగా బాధితురాలిని వివస్త్రను చేశారని, నగ్నంగా ఆమెను రోడ్డుపైన నడిపించారని ఎస్‌పి చెప్పారు.