హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఉపఎన్నికలో మహబూబ్ నగర్ శాసన మండలి స్థానానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు దాదాపు 60 శాతం మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ సీటుకు బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎం.జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీపడుతున్నారు.
పదవీరీత్యా కొడంగల్ ఎంఎల్ఏగా ముఖ్యమంత్రి ఎం. రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఆయన స్వంత నియోజకవర్గం కూడా. మహబూబ్ నగర్ జిల్లాలోని 10 పోలింగ్ స్టేషన్లలో స్థానిక సంస్థల ప్రాతినిధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.
పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1439 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మున్సిపల్ కౌన్సలర్లు, ఎంపిటిసీలు, జెడ్పిటిసీలు, పదవీరీత్యా సభ్యులు ఓటేయడానికి అర్హులు.
ఎంఎల్సి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక చోటుచేసుకుంది. ఆయన ఇదివరలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న జరుగనున్నది.