Sunday, November 24, 2024

టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం..చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో పోటీకి టికెట్ రాలేదని ఆత్మహత్యకు యత్నించిన ఈరోడ్ ఎంపీ గణేశ మూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్ స్థానం దక్కింది. అక్కడి నుంచి గణేశ్‌మూర్తి (77) ఉదయించే సూర్యుడి (డిఎంకే ) గుర్తు పైనే పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా, అక్కడి నుంచి దురైవైగోను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశ్ మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషపూరిత మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మార్చి 24న ఆస్పత్రిలో చేర్చారు.

గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. ఇది ఆత్మహత్య కేసుగా పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. 1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. 1998లో మొట్టమొదటిసారి పళని లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యునిగా పనిచేశారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఓడిపోయినా, గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు 2 లక్షల భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News