బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన సూత్రధారి ముజమ్మిల్ షెరీఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) గురువారం అరెస్టు చేసింది. మూడు రాష్ట్రాలలో విస్తృత దాడులు సోదాల తరువాత ఈ కీలక అరెస్టు జరిగింది. ఈ విషయాలను అధికారికంగా సంస్థ వెల్లడించింది. ఈ నెల 1వ తేదీన జరిగిన పేలుడులో పలువురు కస్టమర్లు, హోటల్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రఖ్యాత కేఫ్ పూర్తిగా దెబ్బతింది. ఈ టిఫిన్ బాంబు పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉండటంతో దీనిని నియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అరెస్టు అయిన షెరీఫ్ మరో ఇద్దరు నిందితులకు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించినట్లు నిర్థారించారు.
నియా బృందాలు ఏకంగా మొత్తం 18 చోట్ల దాడులు జరిపాయి. కర్నాటకలో12 చోట్ల, తమిళనాడులో 5 ప్రాంతాలు, యుపిలో ఒక్కచోట జరిపిన సోదాల క్రమంలో ఈ ప్రధాన నిందితుడి సమాచారం అంచెలంచెలుగా దొరికింది.ఈ క్రమంలోనే అరెస్టు జరిగింది. ఇప్పుడు మరో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. వీరి పేర్లను ఇతర వివరాలను రాబట్టారు. వీరికోసం గాలింపు జరుగుతోంది. ఫరారీలో ఉన్న ఇద్దరు ముస్సవిర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తహాగా నిర్థారించారు. పేలుడు ఘటన తరువాత ఎనిమిది రోజులు మూతపడి 9వ తేదీనే ఈ రెస్టారెంట్ తిరిగి తెరుచుకుంది. భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కస్టమర్లను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తరువాతనే లోపలికి పంపిస్తున్నారు.