Thursday, December 19, 2024

మార్చి దాటక ముందే మంటలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :మార్చి దాటకముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒ క్క తెలంగాణకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఆం ధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలు కూడా సెగలు చిమ్మాయి. అసాధారణ రీతిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలలతో తెలుగు రాష్ట్రాలు ఉడుకెత్తిపోయాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ ,కరీంనగర్ , ఖమ్మం, నిజామాబాద్ , అదిలాబాద్ తదతర పట్టణాల్లో మధ్యాహ్నం ఎండల తీవ్రతతో ప్రధాన రోడ్లు నిర్మాణుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలలో భారీ మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. శుక్రవారం నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉదయం 10 గంటల నుంచే ఎంత తీవ్రత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ఎండల మండుతున్నాయి. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో గురువారం అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు కావడం గమనార్హం. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 42.5 ,ఆదిలాబాద్ జిల్లా అర్లీ టి లో 42.3 గా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో హైదరాబాద్‌లో ఉక్కపోత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

శుక్రవార ం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ సారి ఎండలు భగ్గుమంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యమైన పనులుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చూసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వస్తే మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలని సూచించారు. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు.
అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక విజయవాడ, ఏలూరు, ఒంగోలు, రాజమండ్రి ప్రాంతాల్లో 43-నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ క్రమంగా తగ్గుతూ వేడి గాలులు మొదలవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలనుంచే ఎండల తీవ్రత పెరిగిపోతోంది. వాతావరణంలో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో రోజువారీ కూలీలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రానున్న 5 రోజులు రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో రాయలసీమలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

దస్తూరాబద్‌లో 43.1డిగ్రీలు !
రాష్ట్రంలో గురువారం నాడు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 43.1డిగ్రీల ఉష్ణోగ్రలు నమోదయ్యాయి. సుజాతానగర్‌లో 42.9, ఆసిఫాబాద్‌లో 42.5, తిమ్మాపూర్‌లో 42.4, భద్రాచలంలో 42.3, భీమ్‌పూర్‌లో 42.3, వంకులంలో 42.3 సల్కార్‌పేట్‌లో 42.3, శివన్నగూడెంలో 42.3, బుగ్గబావిగూడలో 42.3 సీతారాంపట్నంలో 42.2, గరిమెళ్లపాడు, మాడుగుల పల్లి, కొత్తగూడెం, కనయ్‌పల్లి, చాపరాల కేంద్రాల్లో 42.2డిగ్రీలు నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి బాలనగర్ ,ఇబ్రహింపట్నం, కోడాద తోగర్రి, కొండాపూర్ కేంద్రాల్లో 42.1డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News