Friday, December 20, 2024

ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ ద ర్యాప్తు చేస్తున్నారు. మాజీ టా స్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు, సిఐ గట్టు మ ల్లును పోలీసులు విచారించారు. ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు  కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఓ మాజీమంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తుండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టయిన అధికారుల ఆస్తులు, ఆదాయా లపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రణీత్‌రావుకు మూసాపేటలోని నివాసంతోపాటు నగరంలో మరో చోట కోట్ల విలువైన విలాసవం తమైన గృహం ఉన్నట్లు అధికారులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో, ఇందుకు సహకరించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఆ పరికరాలని ఎక్కడ పెట్టారు? ఇతర ప్రైవేటు ప్రదేశాలలో ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన రాజకీయ పెద్దలకు సైతం నోటీసులు ఇచ్చి విచారించేందుకు న్యాయ సలహా కోరతున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రణీత్‌రావు, బృందంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్‌కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను ఒక యూనిట్‌గా చేసి ఈ రెండు జిల్లాల వార్ రూమ్‌ను నల్గొండలోని ఓ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంఛార్జ్‌గా వ్యవహరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధితోపాటు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల ఫోన్‌కాల్స్ లక్ష్యంగా ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికాకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ టెకీలు నల్గొండ వార్‌రూంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? బెదిరించిన రియల్టర్లు, వ్యాపారులు ఎవరు, వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారనే దానిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. మును గోడు ఉపఎన్నికల్లోనూ పలువురు నేతలు, వ్యాపారుల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడగా బాధి తులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వాటి ఆధారంగా కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నల్గొండ, దేవరకొండకు చెందిన ఇద్దరు వ్యాపారులు హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసి బాగా ఆర్జించారు. వారి ఫోన్లను ట్యాప్ చేసి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం.

ఇటీవలే ప్రధాన సూత్రధారి ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ఫోన్..?
కాగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ’ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం.’ అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీ సులం ఒకటని, మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్‌కు స్పందించిన ఉన్నతా ధికారి ’మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు సమాధానం రాసి పంపించండి.’ అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలకు కస్టడీ విధించింది. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు వారిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇదే కేసులో ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రణీత్ రావును 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరగా అందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ప్రణీత్ రావు చంచల్ గూడ జైలులో ఉన్నారు. మరో వైపు ప్రణీత్ రావు సోమవారం తన బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News