Friday, December 20, 2024

పారాచూట్ నేతలకే పెద్దపీట

- Advertisement -
- Advertisement -

రెండు పార్లమెంట్ నియోజక వర్గాల్లో అదే సీన్, బిఆర్‌ఎస్ మాజీలకు టికెట్ల
కేటాయింపు ఆశావహుల్లో అసంతృప్తి, ఎన్నికల నాటికి సర్ధుకుంటుందనే ఆశ

వరంగల్ లోని రెండు పార్లమెంట్ స్థానాల్లో పారాచూట్లకే బిజెపి అధిష్టానం టికెట్లను ఖరారు చేసింది. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను అభ్యర్థులుగా ప్రకటించింది. రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా అదే సీన్ పునరావృతం కావడంతో ఆశావాహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని టికెట్లను ఇవ్వడం పట్ల బిజెపి నేతల్లో నిరసన కనిపిస్తున్నది. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ఆలోచనతో బిజెపి అధిష్టానం ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.

ఎలాగైనా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో భాగంగా ఇతర పార్టీల నేతలకు వల విసిరింది. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్‌గా నిర్వహించింది. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నది. అంతటితో ఆగకుండా పార్టీ ఎంపి అభ్యర్థులుగా ఖరారు చేసింది. వరంగల్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్‌ఎస్ మాజీ ఎంపి ప్రొఫెసర్ సీతారాం నాయక్‌ను బరిలో నిలిపింది. ఈ ఇద్దరు కూడా పారాచూట్ నేతలే. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి టికెట్ కోసం అర డజన్ కు పైగా అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారే తమకున్న గాడ్ ఫాదర్‌ల ద్వారా ప్రయత్నించినా…అప్పటికే బిఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేను తీసుకుని టికెట్ ఇస్తారని తెలియడంతో ఆశావాహులంతా ఒక్కటయ్యారు. తమలో ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని బాహాటంగా ప్రకటించారు.

ఆరూరి చేరికను నిరసించారు. అయినప్పటికీ సామాజికవర్గ నేపథ్యం, మాజీ ఎమ్మెల్యే కావడం, అనుచర గణం కూడా ఎక్కువగా ఉండడంతో ఆరూరిని చేర్చుకుని బిజెపి అధిష్టానం టికెట్ ప్రకటించింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన ఆరూరి…కాంట్రాక్టర్ నుంచి పిఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బిఆర్‌ఎస్ నుంచి వర్ధన్నపేట ఎమ్మేల్యేగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజారిటీ తో గెలిచారు. బిఆర్‌ఎస్‌లో వెలుగు వెలిగిన ఆరూరి..2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆరూరికి టికెట్ ఇవ్వడం ద్వారా బిఆర్‌ఎస్ లోని ఓట్లు కూడా కలిసి వస్తుందనే అంచనా వేస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బిజెపి గణనీయమైన ఓట్లు సాధించింది. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీ హవా ఉండడంతో పాటు జిల్లాలో సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని వరంగల్ సీటుపై జెండా ఎగురవేయాలని బిజెపి భావిస్తున్నది.అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆరూరి రమేష్ బీజేపీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో సమావేశాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నేతలను కలిశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆరూరిని కూడా పార్టీ శ్రేణులు కలిసి స్వాగతిస్తున్నారు. అయితే టికెట్ రేసులో ఉండి చివరిదాకా ట్రై చేసిన నేతలు మాత్రం ఇంకా కలిసి రావడం లేదు. ఇంకా సమయం ఉన్నందున అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News