Friday, November 22, 2024

గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంఎల్‌ఎ ముఖ్తార్ అన్సారీ(63) గుండెపోటుతో చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. వివిధ కేసులలో ముఖ్తార్ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాందా జైలులో ఖైదీగా ఉన్న అన్సారీకి గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు అతడిని దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించారు. వైద్యులు ఐసియులో ఉంచి చికిత్స చేస్తుండగా గుండెపోటుతో చనిపోయాడు. అన్సారీ మృతి చెందిన విషయం తెలియగానే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు భద్రతా బలగాలు, పోలీసులు మోహరించారు. అన్సారీకి విషపూరిత ఆహారం అందించడంతో అనారోగ్యానికి గురయ్యారని ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపి అఫ్జల్ అన్సారీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అన్సారీ అనారోగ్యంగా ఉండడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు వివరణ ఇచ్చారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మౌకు చెందిన అన్సారీ గ్యాంగ్ స్టర్‌గా మారడంతో అతడిపై 61 కేసులు నమోదయ్యాయి. అతడు ఐదు సార్లు ఎంఎల్‌ఎగా సేవలందించారు. 1990లో అన్సారీ సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని దోపిడీలు, కిడ్నాపులు, 15 హత్య కేసులలో పాలుపంచుకున్నాడు. 2004లో ఆయన వద్ద మెషిన్ గన్ బయటపడడంతో ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అతడిని జైలుకు తరలించారు. బిజెపి ఎంఎల్‌ఎ కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో అతడికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారనే నేపథ్యంలో మార్చి 13న అతడికి కోర్టు జీవితఖైదు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News