రాజ్యసభ ఎంపి కే.కేశవరావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వేళ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నేడు కడియం, కేకే అకస్మాత్తుగా బిఆర్‌ఎస్‌ను వీడటంతో కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నారని, మరి కొంత మంది బిఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరారని పేర్కొన్నారు. మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి…నేను గొర్రెను కాను. కాలేను అని.. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడను, తాను తాను గతంలో చేసిన బిఎస్‌పి బిఆర్‌ఎస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి అని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి వచ్చింది తన స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు అని, తాను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్టసభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను తన శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని తాను ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు. ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు బిఆర్‌ఎస్ పార్టీకి కొత్తేం కాదు అని, ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదని బిఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దామని పిలుపునిచ్చారు. “పదండి ముందుకు.. పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి”…కదం తొక్కుతూ, పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పైపైకి..జై భీం…జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.