జపాన్ విదేశీ వర్కర్ వీసా కార్యక్రమం విస్తరణ
ఇలా చేయడం మొదటిసారి
టోక్యో : జపాన్ ప్రభుత్వం తమ విదేశీ నైపుణ్య శ్రామిక వీసా కార్యక్రమాన్ని విస్తరించింది. ఐదు సంవత్సరాల వరకు జపాన్‌లో గడిపేందుకు మరింత మందికి అవకాశం ఇవ్వడం ద్వారా డ్రైవర్ల కొరతను అధిగమించడం జపాన్ ప్రభుత్వ లక్షం. జపాన్ వార్తా సంస్థ క్యోడో న్యూస్ సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమానికి నాలుగు కొత్త పరిశ్రమలు & రోడ్, రైల్వే రవాణా, అడవుల పెంపకం, కలప రంగాలను చేర్చడమైంది.
2019లో ప్రారంభించినప్పటి నుంచి వీసా కార్యక్రమాన్ని విస్తరించడం ఇదే ప్రథమం. క్షీణిస్తున్న జననాల రేటు, రవాణా, లాజిస్టిక్స్ పరిశ్రమలలో కొరతలు వంటి అంశాల కారణంగా విదేశీ శ్రామికుల కోసం జపాన్ డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ నుంచి డ్రైవర్లకు ఓవర్‌టైమ్ గంటలను పరిమితం చేస్తూ కొత్త నిబంధనలు అమలు చేయనుండడంతో ఈ కొరతలు శ్రుతి మించనున్నాయి. ఏప్రిల్ నుంచి వచ్చే ఐదు సంవత్సరాలలో నైపుణ్య శ్రామిక వీసా కార్యక్రమం కింద 8.20 లక్షల మంది విదేశీయులను చేర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్షం.