Monday, December 23, 2024

రాజాకార్ సినిమాను బ్యాన్ చేయాలి : ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి

- Advertisement -
- Advertisement -

మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే రాజాకార్ సినిమాను బ్యాన్ చేయాలి : ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొడుతున్న దుష్టశక్తుల ఆగడాలను తెలంగాణలో సాగనీయమని, చరిత్రను వక్రీకరిస్తూ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించే రాజాకార్ సినిమాను బ్యాన్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ కె. ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం హిమాయత్ నగర్ లోని సత్య నారాయణ రెడ్డి భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ చీలికలు తెచ్చి అశాంతిని నెలకొల్పుతున్నదని,అదే విధానాలను తెలంగాణ లో కూడా అమలు చేయాలని ప్రజల మధ్య మతం రంగు తో అల్లర్లు నిర్వహించాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఈ దుష్ట చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని, బీజేపీ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ప్రాంతంలో జరిగిన ఘటన అదే కోవలోకి వస్తుందని, రెండు మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించి ఘర్షణలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు.

కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ నీచపు అకృత్యాలకు పాల్పడటం సిగ్గు చేటు అన్నారు. అదే విధంగా రాజాకార్ సినిమాలో తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజాం వ్యతిరేక పోరాటం అంటే మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి గ్రామాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారనే అబద్దాలు చెప్పారని, కావాలనే ఒక వర్గం పట్ల వ్యతిరేక నినాదాలు చేర్చి ఈ సినిమాలో చూపించారని ధ్వజమెత్తారు. ‘మనుషులను చంపగలరు కానీ మా మతాన్ని, హిందువులను చంపలేరు‘ అనే డైలాగులతోనే వివాదం చేస్తున్నారన్నారు.

ఆనాడు ప్రజలు సాధారణంగా ఆంధ్ర మహాసభ జిందాబాద్ అన్నారే, కానీ, కనీస ప్రస్తావన లేని ’వైదిక మతం జిందాబాద్’ అనే నినాదాలు గ్రామాలలో ఇచ్చినట్లు, ఈ సినిమాలో చూపించారన్నారు. మత కోణంలోనే ఈ పోరాటం జరిగితే విస్నూర్ రాంచంద్ర రెడ్డి గుండాలు చంపిన షేక్ బందగీ, రజాకార్లు చంపిన ముస్లిం జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ ఎవరో చెబుతారా? గ్రామాల్లో ఆరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రజాకార్ల సైన్యానికి అధ్యక్షుడు ఖాసిం రజ్వీ అయితే, ఉపాధ్యక్షుడు విస్నూరు రామచంద్రారెడ్డి అనేది తెలియదా? ప్రజలపై దాడులు చేయించిన,ప్రజలను పీడించిన రజాకార్లకు విడిది ఈ దొరల గడీలే అన్న సంగతి తెలియదా? అన్నదమ్ములాగ కలసి అన్ని మతాల, కులాల వారు చేసిన వీరోచిత పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైనా దేశ భక్తులు ఎలా అవుతారని వారు ప్రశ్నించారు.

అశేష త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల త్యాగాల గురించి ఈ సినిమాలో ఎక్కడా చూపించలేదని విమర్శించారు.కమ్యూనిస్టుల నాయకత్వంలోనే ప్రజలు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోని పోలీసు, రజాకార్ల దాడులను తిప్పికొట్టారని గుర్తుచేశారు. గెరిల్లా దళాలు ఏర్పాటు చేసి బందూకు శిక్షణ నేర్పింది కమ్యూనిస్టులేని వారు ఉద్ఘటించారు. ఈ దెబ్బతో దొరలు గ్రామాల నుండి పారిపోయారని, కమ్యూనిస్టులు భూసంస్కరణలు అమలు జరిపి 12 లక్షల ఎకరాల భూమి పంచారన్నారు.వెట్టి చాకిరి, బానిస విధానం రద్దైంది, రుణాలు, రుణ పత్రాలు, అప్పులు, వడ్డీలు రద్దయ్యాయని, స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయన్నారు. అంటరానితనం పోయి, కుల, మత వివక్షత లేకుండా కలిసికట్టుగా దొరలపై నాడు పోరాటం చేశారన్నారు. కమ్యూనిస్టు పోరాటం వలన గ్రామాల్లో పీడన, బానిసత్వం నుండి విముక్తి దొరికిందన్నారు.

‘దున్నేవాడికే భూమి‘ అనే నినాదం కమ్యూనిస్టులదని, దోపిడీకి వ్యతిరేకంగా భూస్వాములపై ఎర్రజెండా నీడలో పోరాడారన్నారు. గడీలు బద్దలు కొట్టి ప్రజలంతా కుల, మతాలకతీతంగా నిజాంపై పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని వారు అన్నారు. ఈ మట్టి మనుషుల త్యాగాల చరిత్ర వక్రీకరించడం, కేవలం మతకోణంలో ఈ పోరాటాన్ని చూపడం దుర్మాగపు చర్యఅని, పీడనకు వ్యతిరేకంగా పీడితులు చేసిన గొప్ప పోరాటం నేటి మన తరాలకు ఆదర్శమని అన్నారు. అసలైన చరిత్ర పేరుతో ఈ వక్రీకరణలను చేస్తున్న కుట్రలను తెలంగాణ రాష్ట్ర యువత, ప్రజలు తిప్పికొట్టాలని, చరిత్ర ను వక్రీకరించే దుష్టశక్తులను భూగర్భంలో పాతరవేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ కునుకుంట్ల శంకర్, బిజ్జ శ్రీనివాసులు, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News