మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలని, వ ర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్ర యత్నించే నీచమైన ప్రవృత్తికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నాయకు లు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆ యన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ అధికారంలోకి వచ్చిందని, అప్పటికే వ ర్షాకాలం గడిచిపోయిందని, నాగార్జునసాగర్‌లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే
నీరు ఇవ్వని గత పాలకులు, రెండో పంటకి సాగునీరు ఇవ్వాలని హేతుబద్దత లేని డిమాండ్ చేయడం వారి దుర్బుద్ధ్దికి తార్కాణమని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పాపాలను ఈ 100 రోజుల ప్రభుత్వానికి రుద్దాలనుకోవడం నీచమైన రాజకీయాలకు నిదర్శమన్నారు. అనుమతులు లేకుండా, అధికారులు చెప్పినా వినకుండా, ప్రక్క రాష్ట్రాలు నీటిని తరలిస్తున్నా, కళ్లు మూసుకుని రిజర్వాయర్లు ఖాళీ చేసిన ప్రబుద్ధులు మాకు నీతులు చేప్పే స్థాయి కాదని ఎద్దేవా చేశారు. నీటి నిర్వహణ మీద కనీస దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం ప్రక్క రాష్ట్రాలని అడుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చిన నాయకుడు కెసిఆర్‌నేని మండిపడ్డారు.
రైతుబంధు పథకం మే నెల వరకు ఇచ్చిన ఘనత సొంతం చేసుకున్న ప్రభుత్వం మీది కాదా, కేవలం రైతుబంధు పేరు మీద మిగతా పథకాల్లో విత్తన సబ్సిడీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్ల మీద సబ్సిడీలన్ని ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతులకు కోలుకోనీయలేని దెబ్బతీశారని విమర్శించారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన రైతులకు రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పి ఒక పైస కూడా ఇవ్వలేదని, గత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏనాడైన ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన ఏ ఒక్క రైతునైనా ఆదుకోలేదని, కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ. 10వేలు నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా అంటూ నిలదీశారు. కేవలం మెదటి విడతగా రూ. 150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్ మాసంలో కురిసిన వడగళ్ళ వానలకు నష్టపోయిన రైతులకు రూ. 304 కోట్లకు జీవో రిలీజ్ ఇచ్చి ఎందుకు డబ్బులు విడుదల చేయలేదన్నారు. మే నెలలో సంభంవించిన పంట నష్టాన్ని కనీసం సర్వే చేయించలేదని, ఎన్నో రకాలుగా రైతులను అధోగతి పాలు చేసి, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పరామర్శకు వెళుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పలికే మాయ మాటలు నమ్మడానికి ఇప్పుడు ఏ తెలంగాణ రైతు సిద్ధంగా లేరని,
పంటల బీమా పథకం ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రీయ కృషీ వికాస్ యోజన, సాయిల్ హెల్త్ మేనేజ్ మెంట్, జాతీయ ఉద్యాన పథకం ఇలా ఒకటేంటి అన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా , ఏ ఒక్క పథకం అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నారన్నారు. వ్యవసాయరంగమే కాదు, అన్ని వ్యవస్థలను కుప్పకూల్చి, అవినీతిమయం చేసిన ఘనత గత పాలకులదేనని, ధాన్యం కోనుగోలులో బ్యాంకు గ్యారంటీలు విచ్చలవిడిగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్లు అప్పులు మిగిల్చి ఆ కోనుగోలును ఏనాడు సక్రమంగా నిర్వహించలేదన్నారు. ఉచిత విద్యుత్ పేరు మీద, అధిక ధరకు విద్యుత్ కోనుగోలు చేసి, తక్కువ ధరకు కొనే అవకాశమున్నా, వేల కోట్ల విద్యుచ్ఛక్తి భారం రాష్ట్ర రైతుల మీద వేసి కోరుకొన్న కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చారని తెలిపారు. రైతులకు నీళ్లీస్తామని చెప్పుకుంటూ, నిపుణులు, సహచరుల సూచనలు పెడచె విన పెట్టి మూర్ఖంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణం ఎవరిది ప్రాజెక్టుల నిర్మాణమని చెప్పి పంపులకు, మోటార్లకు వేల కోట్లు కంపెనీలకు దోచిపెట్టి, కమీషన్లు దండుకొని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని పేర్కొన్నారు. కనీసం నాణ్యతా ప్రమాణాలు లేకుండా, ఇంత అసంబద్దమైన ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి, ఇన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేసి, తెలంగాణ సమాజం మీద భారం మోపారని ఆరోపించారు.
విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు, సాగునీటి రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణుల సూచనలు లెక్క చేయకుండా కమీషన్ల కక్కుర్తితో వాటిని రాష్ట్రానికి గుదిబండగా మార్చారని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గోల్ మాల్ ఉందని, ధాన్యం కొనుగోలు, ధరణిలో భూములు తప్పడు నమోదు వాటిని తిరిగి అమ్మడంలో గోల్ మాల్ చేశారు. విద్యుచ్ఛక్తి కొనుగోలు, గొర్రెల పథకం, చేప పిల్లల పంపిణీ, దళితబంధు పథకం, చివరికి రోగులకు ఇచ్చే సిఎంఆర్‌ఎఫ్ పథకంలో కూడా గోల్ మాల్ చేసి కోట్లు కూడబెట్టుకుంటారని విమర్శించారు. వారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో అవినీతి, కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు, ఆఖరికి నికృష్టమైన ఫోన్ ట్యాపింగ్‌కు కూడా బరితెగించి కుటుంబసభ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసిన ఘనులన్నారు. గత పాలన వ్యవస్థలో ఇన్ని అరిష్టాలకు, అక్రమాలకు,
అన్యాయాలకు పాల్పడిన ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారని దుమ్మెత్తి పోశారు. వర్షాభావ పరిస్థితులను కూడా రాజకీయం చేయాలనుకొనే హేయమైన పనులకు పాల్పడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదని, పంటలభీమా పథకం పునరుద్ధరించి దాదాపు రూ. 2500 కోట్ల వరకు రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి భవిష్యత్తులో ఏ ఒక్క రైతుకూడా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకూడదని ధృడ సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలలో ఎంతో కొంత ఉన్న వ్యక్తిత్వాన్ని కెసిఆర్ చంపుకోవద్దని మిత్రుడిగా సలహా ఇస్తున్నానని పేర్కొన్నారు.