అమరావతి: రిటైర్డ్ ఉద్యోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో వైద్యుడు పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో జరిగింది. చొదిమెళ్ల గ్రామంలో బత్తిని మల్లేశ్వరరావు (63) అనే వ్యక్తి తపాలా శాఖ లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. అదే గ్రామానికి చెందిన భానుసుందర్ ఎంబిబిఎస్ చదివి నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మల్లేశ్వరరావుతో పరిచయం పెంచుకొని ఫ్యామిలీ డాక్టర్‌గా వారి కుటుంబానికి భానుసుందర్ వైద్య సేవలు అందిస్తున్నాడు. డిసెంబర్ 24న మల్లేశ్వర రావుకు చికిత్స చేయడానికి ఆయన ఇంటికి వైద్యుడు భానుసుందర్ వెళ్లాడు.
ఇంట్లో ఎవరు లేకపోవడంతో రావుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. మత్తులోకి జారుకున్న తరువాత ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుతో డాక్టర్ పారిపోయాడు. మల్లేశ్వరరావు అనారోగ్యం పాలుకావడంతో చనిపోయాడు. తొలుత అందరూ సహజమరణం అని భావించారు. డాక్టర్ భానుసుందర్‌పై రావు కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే అతడిని నిలదీయడంతో నిజాలు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సదరు డాక్టర్ గతంలో రోగులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటనలు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి.