శ్రీనగర్: జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ఆయన సొంత పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డిపిఎపి) మంగళవారం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని 2022లో ఆజాద్ సొంతపార్టీ పెట్టుకున్నారు. డిపిఎపి కోర్ కమిటీ మంగళవారం నాడిక్కడ సమావేశమై అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షుడు ఆజాద్ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నాయకుడు తాజ్ మొహియుద్దీన్ విలేకరులకు తెలిపారు.
2014లో ఉధంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి జితేంద్ర సింగ్ చేతిలో ఓటమిపాలైన తర్వాత ఆజాద్ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి. అల్తాఫ్ బుఖారీకి చెందిన అప్నీ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆ విషయమై ఎటువంటి పురోగతి లేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీరులోని ఇతర లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.