ఇక జట్టు వరుస ఓటములు కెప్టెన్ హార్దిక్‌కు సవాల్‌గా మారింది. అతనిపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్ టైటాన్స్‌ను విజయపథంలో నడిపించిన హార్దిక్ ముంబై సారథిగా మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతని కెప్టెన్సీలో ముంబై ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయం మూటగట్టుకుంది.
దీంతో హార్దిక్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు హార్దిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత గడ్డ గుజరాత్‌లోనూ అతనికి అభిమానులు అండగా నిలువలేదు. గుజరాత్‌ను వీడి ముంబైతో జత కట్టడాన్ని అక్కడి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్‌కు స్థానిక ప్రేక్షకుల నుంచి చేదు అనుభవమే ఎదురైంది.
ముంబైలో జరిగిన మ్యాచుల్లోనూ అతనికి ఇలాంటి పరిస్థితి తప్పలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ అభిమానులు హార్ధిక్‌ను హేళన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. గుజరాత్ కెప్టెన్ ఓ వెలుగువెలిగిన హార్దిక్‌కు ముంబై టీమ్‌లో చేరిన తర్వాత పరిస్థితులు అన్నీ ప్రతికూలంగానే మారాయని చెప్పాలి. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓడడంతో హార్దిక్‌తో పాటు జట్టుపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇలాంటి స్థితిలో అతను ముంబై ఎలా ముందుకు నడిపిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.