Sunday, November 24, 2024

పార్టీ గేట్లు ఎత్తడం కాదు… ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో జోరుగా ట్యాంకర్ల దందా నడుస్తోందని, ప్రాజెక్టుల్లో నీరున్నా ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలు ఓటు వేయలేదని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని విమర్శలు గుప్పించారు.  హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయని చురకలంటించారు. బిఆర్‌ఎస్ హయాంలో గిరిజన తండాలకూ తాగునీరు అందించామని, మిషన్ భగీరథ నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి తెలియదని దుయ్యబట్టారు.

గత సంవత్సరం వర్షాలు బాగా కురిశాయని ఐఎండి చెప్పిందని, ఎండాకాలం ఆరంభంలోనే తాగు నీటి కష్టాలు వచ్చాయని, మరో రెండు నెలల పాటు ఎండలు ఉంటాయని, తాగునీటి కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని, పార్టీ గేట్లు ఎత్తడం కాదు అని, ప్రాజెక్టులు గేట్లు ఎత్తాలని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాదు… వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలని, నాగార్జున సాగర్, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని, చుట్టు నీళ్లున్నా హైదరాబాద్ వాసులు నీళ్లు ఎందుకు కొనాలని ప్రశ్నించారు.

సాగర్ నుంచి 14 టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉందని, మల్లన్న సాగర్ నుంచి కూడా హైదరాబాద్‌కు నీరు తీసుకొచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివిలేదని ధ్వజమెత్తారు. సాగు నీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారని, కాంగ్రెస్ వారు దుష్ప్రచారం చేస్తున్న కాళేశ్వరం నుంచి జల పరవళ్లు తొక్కుతున్నాయని, నీళ్లు వదలకుండా పంటలు ఎండిపోయేలా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమా? అని అడిగారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News