మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జి లు శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కొం డా సురేఖ, ఎంఎల్‌ఎ రోహిత్, మాజీ ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు తో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గల ఇంచార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నిక ల్లో 14 సీట్లు గెలువడమే లక్షంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కనబెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని నొక్కి చెప్పారు. సర్వేలు, ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకొనే ఎఐసిసి టికెట్లు ఖరారు చేసిందని, అభ్యర్థులందరినీ గెలిపించాల్సిన అవసరం స్థానిక నాయకులపై ఉందని అన్నారు. మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, బిజెపి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని ప్రచారంలో మన పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎంఎల్‌ఎలతో పాటు మాజీ ఎంఎల్‌ఎలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నేతల స్థాయిని బట్టి ప్రాధాన్యత ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. మెజారిటీ ఎంపి సీట్లు గెలిస్తేనే రాష్ట్రంలో పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు. ఇగోలకు పోయి అభ్యర్థులను ఆగం చేయొద్దని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో చిన్నపాటి సమన్వయ లోపం గుర్తించామని, అవి ఆయా స్థానాలకు నష్టాన్ని చేకూర్చాయని అన్నారు. ఇప్పడు అవి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.
జిల్లాల్లో పర్యటిస్తా…
లోక సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగేందుకు మరింత చొరవ తీసుకుండామని అన్నారు. ఇందుకు ప్రణాళికలు తయారవుతున్నాయన్నారు. క్షేత్ర స్థాయి నేతలు, జిల్లా స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ఎలాంటి నష్టాలు ఉండవని చెప్పారు. కార్యకర్తల మద్దతు ఉంటేనే పదేళ్ళ పాటు అధికారంలో ఉంటానమని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు అనేక కష్టాలు పడి అధికారంలోకి వచ్చామని ఇప్పడు చిన్న చిన్న తప్పిదాలతో చేజార్చుకునే పరిస్థితి ఉండకూడదని అన్నారు. రాష్టాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పట్టిస్తూనే పార్టీని ఎలా ఆదుకోవాలో తనకు స్పష్టంగా తెలుసని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ నర్సారెడ్డి, పఠాన్ చెరు ,నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పూజాల హరికృష్ణ, నాయకులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.