Thursday, November 21, 2024

అవసరమెంతో అనుమానమంత

- Advertisement -
- Advertisement -

బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదిక అవసరం ఈ రోజున దేశానికి ఎంతున్నదో, అటువంటి వేదిక అంటూ ఏర్పడిన ‘ఇండియా’ కూటమి పట్ల అనుమానాలు కూడా అంతున్నాయి. ఈ కూటమి అధికారానికి రాగలిగినన్ని స్థానాలు గెలవగలదా అన్నది మొదటి అనుమానమైతే, ఆ ప్రభుత్వం స్థిరంగా ఉండగలదా అనేది రెండవది. అయితే, వారి విధానాలు దేశాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంత వరకు తోడ్పడగలవన్న మూడవ అనుమానంగా ముందుకొస్తున్నాయి. మొన్న మార్చి 31 న ఢిల్లీలో జరిగిన సభ తర్వాత కూడా ఈ సందేహాలు తీరటం లేదు.

బిజెపి అనండి, ఎన్‌డిఎ అనండి వారు ఇప్పటికి రెండు సార్లు మంచి మెజారిటీలతో అధికారానికి వచ్చి పూర్తి కాలం సుస్థిరంగా పాలించారు. స్వంత బలంతో లేదా సామదానభేదోపాయాలతో అత్యధిక రాష్ట్రాలను పాలిస్తున్నారు. ఇపుడు మరొక మారు లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా కూడా అంతే బలంగా కనిపిస్తున్నారు. మరి ఎందుకు ప్రత్యామ్నాయం అవసరమని అనుకోవడం ఎందుకు? ఈ ప్రభుత్వం బలహీనంగా ఉందని, స్థిరంగా లేదని కాదు. సమస్య విధానాలకు సంబంధించినది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో, విదేశాంగ రంగంలో, సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగం లో సాధించినవి కొన్నున్నాయని చెప్తారు. అది పూర్తిగా కొట్టివేయదగినది కాదు. ఆర్థికంగా స్థిరత్వం, కొంత పురోగతి ఉన్నాయి. సంక్షేమ రంగంలో ముఖ్యంగా తక్కిన దేశం కన్న వెనుకబడిన హిందీ రాష్ట్రాలలో పేద ప్రజలు మెచ్చే చర్యలు కొన్ని తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కూడా అదే విధంగా జరిగింది. విదేశాంగ రంగంలో కొన్ని విషయాలలో భారత దేశం తన గౌరవాన్ని, ర్యాంకింగ్‌లను కోల్పోయినా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని తరచు ధిక్కరించి, దేశ ప్రయోజనాల కోసం నిలబడుతున్నది. వీటన్నింటిలోనూ చీకటి వెలుగులున్నాయి.

మరొక వైపు చూస్తే, బిజెపికి ప్రత్యామ్నాయం తప్పక అవసరమనిపించే విషయాలు కొన్నున్నాయి. వాటిలో అన్నింటికన్న ముందు ఆలోచనలలోకి వచ్చేది బిజెపి మతతత్వ విధానాలు. బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ గాని, దానితో పాటు సంఘ్ పరివార్ గాని భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం తమ లక్షమని ఎటువంటి దాపరికం లేకుండా ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏర్పడినందున బిజెపి ఆ మాట బహిరంగంగా అనటం సాధ్యం కాదు గనుక ఆ పని చేయలేదు గాని, ఆ పార్టీ విధానాలు, ప్రభుత్వ చర్యలు ఎటువంటి సందేహం లేని విధంగా అటువైపే దారి తీస్తున్నాయి. ఒకవేళ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ సంస్థలు సైద్ధాంతికంగా, మేధోపరంగా, శాంతియుతం గా ప్రజలను అందుకు ఒప్పించగలిగితే సమస్య ఉండదన్నది కొందరి అభిప్రాయం. అందువల్ల కొన్ని సమస్యలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు. కాని అనేకానేక కుల మతాలు, జాతులు, భాషా సంస్కృతులు, భావజాలాలకు నిలయమైన ఈ సువిశాల దేశం లో భిన్నత్వంలో ఏకత్వమనేదే వాంఛనీయమవుతూ వస్తున్నది. ఏకత్వమే తప్ప భిన్నత్వానికి తావు లేదనడం తప్పకుండా తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. ఆ విషయం బిజెపికి తెలియనిది కాదు. అయినప్పటికీ ఏమి చేసైనా సరే ఏకత్వాన్ని సాధించబూనడం, అందుకు మతం ఒక సాధనం కావడం ఈ దేశానికి ఏ విధంగా చూసినా వాంఛనీయం కాదు. అది దేశ సామాజిక, భౌగోళిక స్థిరత్వాలకు ముప్పు తేగలదు.

బిజెపికి ప్రత్యామ్నాయం అవసరమని భావించటానికి ఇది ఒక ప్రధాన కారణం కాగా, ఆర్థిక విధానాలు రెండవ కారణం. ఆర్థిక రంగం ఒక కోణం నుంచి చూసినప్పుడు బలపడుతున్న మాట నిజం. కాని ఎప్పుడైనా పెరుగుదల (గ్రోత్), అభివృద్ధి (డెవలప్‌మెంట్) రెండు భిన్నమైన విషయాలు. ఉదాహరణకు ఈ రోజున భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు 10వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు ఎదిగింది. త్వరలో 3 వ ర్యాంకుకు చేరగలదని మోడీ ప్రభుత్వం చెప్తున్నది. కాని అభివృద్ధి లేదా మానవాభివృద్ధిపరంగా మన ర్యాంకు 2000 ల సంవత్సరంలో సుమారు 100 కాగా, ఇప్పుడు పదేళ్ళ మోడీ పాలన తర్వాత 134కు పతనమైంది. ఇందుకు అదనంగా, వ్యవసాయదారుల పరిస్థితి క్షీణించడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుదల, ధనిక పేద తారతమ్యాలు ఎన్నడూ లేని స్థాయికి చేరడం, దేశ సంపదలు అతి కొద్ది మంది వద్ద పోగుపడడం, ప్రకృతి వనరులను వారు యథేచ్ఛగా కొల్లగొట్టి విధ్వంసం చేయటం వంటివి బిజెపి అదుపు లేకుండా సాగుతున్నాయి. దీనినంతా వామపక్షాలతో సహా ప్రతి పక్షాలు సైతం ప్రశ్నించలేకపోతున్నాయి. లేదా ప్రతిపక్షాలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటున్నది.

బిజెపికి ప్రత్యామ్నాయం అవసరమనేందుకు పైన ప్రస్తావించినవి రెండు కారణాలు కాగా, ప్రజాస్వామిక విధివిధానాలకు భంగం వాటిల్లుతుండటమన్నది మూడవ ముఖ్య కారణం. పలు భంగపాట్లు లోగడ కాంగ్రెస్ ఏలుబడిలోనూ చోటు చేసుకున్నాయి. అదే విధంగా ప్రతిపక్ష రాష్ట్రాలలోనూ తరచు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్టికల్ 365 ను, గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగపరచడం, ఇతర పార్టీల సభ్యులను కొనుగోలు చేయడం, చట్టసభల స్పీకర్లు, ఎన్నికల కమిషన్, న్యాయస్థానాల వంటి రాజ్యాంగ వ్యవస్థలను అదుపులో పెట్టుకోవడం, ప్రతిపక్ష ప్రభుత్వాలను నిధుల కేటాయింపులో ఇబ్బంది పెట్టడం వంటివి. ఇటువంటి ధోరణులు మోడీ పాలనలో విచ్చలవిడిగా మారాయి. ఉదాహరణకు, అసెంబ్లీ ఎన్నికలలో తమకు ఆధిక్యత రాకపోయినా అవతలి పార్టీలను చీల్చడం, గవర్నర్ల ప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఈ పదేళ్లలో ఎన్ని సార్లు జరిగిందో ఎంత బాహాటంగా సాగిందో లెక్క కూడా లేదు. అయినా మోడీ వీలైన ప్రతిసారి ప్రజాస్వామ్యం గురించి గంభీరమైన ప్రవచనాలు చెప్తుంటారు.

ఇది ఒకటి కాగా, ధన బలాన్ని ఉపయోగించడం పరాకాష్ఠకు చేరింది. ఆశ్రిత పెట్టుబడిదారీ ధనిక వర్గానికి అనుకూలమైన విధానాలు రూపొందించడం, వారు చూస్తుండగానే ప్రపంచ స్థాయి ధనవంతులు అవుతుండడం, వారి నుంచి మామూలు పద్ధతిలో, ఇతర వ్యాపార వర్గాల నుంచి బెదిరింపులతో, సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థల ప్రయోగంతో వసూళ్ళు ఏ విధంగా సాగుతున్నాయనే దానికి ఎన్నికల బాండ్లు ఒక తిరుగులేని ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇక పౌర హక్కులను, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడమైతే ఇంచుమించుగా లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ నియంతృత్వాల స్థాయికి చేరింది. అందువల్లనే ప్రపంచ స్థాయి సంస్థలు మేధావుల నుంచి మోడీ ప్రభుత్వాన్ని “ఎన్నికైన నియంతృత్వ’ మని అభివర్ణించడం, మన ప్రజాస్వామ్యాన్ని 105 వ ర్యాంకుకు దించివేయడం జరిగిపోయింది.

ఇటువంటి వివిధ తీవ్రమైన కారణాల వల్ల బిజెపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఒక తప్పనిసరి అవసరంగా మారింది. ఒకవేళ ఆ పార్టే మూడవసారి కూడా అధికారానికి వచ్చినట్లయితే ఏమి జరగవచ్చునన్న ఆలోచనే పలువురిని భయపెడుతున్నది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వాన గల ‘ఇండియా’ కూటమి గురించి ఊహించినప్పుడు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు కనిపిస్తున్నది. దేశంలో ప్రత్యామ్నాయ ఐక్య సంఘటనలన్నవి 1977లో జనతా పార్టీ తో మొదలయ్యాయి. తర్వాత 47 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంచ్‌ల నుంచి మొదలుకొని ప్రస్తుతపు ‘ఇండియా’ కూటమి వరకు పలు వేదికలు ఏర్పడినా ఏదీ స్థిరంగా లేక ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవటం ఒక సమస్య.

స్వయంగా ఆ పార్టీల విధానాలు, వ్యవహరణలు, ప్రభుత్వ పాలనలు గొప్పగా ఏమీ లేకపోవడం, వారు సైతం అవినీతిపరులు కావడం మరొక సమస్య. ప్రస్తుత ‘ఇండియా’ కూటమిలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. నిరుడు జులైలో ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు ఆ పార్టీలు సరైన ఐక్యతను సాధించలేకపోయాయి. ఎన్నికలకు కొన్ని వారాల వ్యవధి మాత్రమే ఉండగా సీట్ల సర్దుబాట్లు పూర్తి చేసుకోలేకపోతున్నాయి. ఇంతే ముఖ్యంగా, అసలు వివిధ అంశాలపై తమ ఉమ్మడి విధానాలు ఏమిటో, అవి బిజెపికి ఏ విధంగా భిన్నవైనవో, ప్రజలకు గాని, దేశానికి గాని ఎట్లా మేలు చేస్తాయో వారు చెప్పడం లేదు. ప్రజలు దేనిని చూసి తమపై ఆశలు పెట్టుకోవాలి?

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News