న్యూఢిల్లీ: ఒకవైపు భారత్ లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్న వేళ శ్రీలంక మాజీ రాయబారి ఆస్టిన్ ఫెర్నాండో తీవ్ర వ్యాఖ్య చేశారు. కచతీవు అంశాన్ని బిజెపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే(ఓట్ పుల్లర్) లేవనెత్తిందన్నారు. ఎన్నికల తర్వాత వెనకడుగేయడం తర్వాత భారత ప్రభుత్వానికి సమస్యగా మారొచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆయన ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ దినపత్రికకు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఒకవేళ భారత ప్రభుత్వం శ్రీలంక సముద్రపు ఎల్లలను ఉల్లంఘిస్తే దానిని ‘శ్రీలంక సారభౌమత్వం ఉల్లంఘనగా’ భావించడం జరుగుతుందన్నారు. 1980 దశకం చివర్లో ఇండియన్ పీస్ కీపింగ్ బలగంపై శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమ్ దాస ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘ఒకవేళ పాకిస్థాన్ గోవా వద్ద సముద్ర ఆక్రమణకు పూనుకుంటే భారత సహిస్తుందా? అలాగే బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ సముద్ర ఎల్లలను ఉల్లంఘిస్తే అప్పుడు భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది?’ అని ప్రశ్నించారు. ఫెర్నాండో 2018 నుంచి 2020 వరకు భారత్ కు శ్రీలంక హైకమిషనర్ గా పనిచేశారు.
భారత్ 1974లో శ్రీలంకకు కచతీవు ద్వీపకల్పాన్ని ఇచ్చేసింది. దానిని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తప్పు పడుతూ తప్పిదానికి ఇందిరా గాంధీని నిందించారు. కాగా బిజెపికి తమిళనాడులో తగినంత సత్తా లేనందున ఓట్ పుల్లర్ గా ఈ అంశాన్ని లేవనెత్తారని ఫెర్నాండో అభిప్రాయపడ్డారు.