న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు, పాఠ్య పుస్తకాల విడుదలపై ఎన్‌సీఈఆర్‌టి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్) కీలక ప్రకటన చేసింది. 3-6వ తరగతులకు మాత్రమే కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. మూడో తరగతి పుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, ఆరోతరగతి పుస్తకాలను మే మధ్యకాలం నాటికి విడుదల అవుతాయని వెల్లడించింది. అలాగే 1,2,7,8, 10,12 తరగతులకు సంబంధించి 2023-24 ఎడిషన్స్ పాఠ్య పుస్తకాలు 1.21 కోట్ల కాపీలు దేశ వ్యాప్తంగా విడుదల చేసినట్టు తెలిపింది. మారిన కరికులమ్‌కు అనుగుణంగా ఆరో తరగతి విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల కోసం ఎన్‌సిఇఆర్‌టి పోర్టల్‌లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉందని తెలిపింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
“పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ 2023 ని అనుసరించి 202425 విద్యాసంవత్సరంలో 3, 6 తరగతులకు మాత్రమే ఎన్‌సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాలను తీసుకొస్తోంది. మూడో తరగతి పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ చివరి వారంలో, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలు మే మధ్యలో విడుదల చేస్తాం. 4,5,9,11వ తరగతులకు బఫర్‌స్టాక్ సిద్ధంగానే ఉంది. అన్ని పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలు మా వెబ్‌సైట్‌తోపాటు DIKSHA, epathasala పోర్టల్, యాప్‌లలో ఉచితంగా లభిస్తాయి” అని ఎన్‌సిఇఆర్‌టి పేర్కొంది. మరోవైపు 4,5,9,11వ తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలు విడుదలయ్యాయని, ఈ తరగతులకు కొత్తగా మరో 1.03 కోట్ల కాపీలను ప్రింటింగ్ కోసం ఆర్డర్ చేసినట్టు వెల్లడించింది. ఈ పుస్తకాలు మే 31 నాటికి అందుబాటు లోకి రావొచ్చని వివరించింది.