వ్యసనాలకు బానిసగా మారి డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ యువకుడిని మాదాపూర్ ఎస్‌ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి శుక్రవారం పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15గ్రాములు ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2,25,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని గుంటూరు జిల్లా, అమరావతికి చెందిన పొదిల జైచంద్ సన్‌సిటీలో ఉంటున్నాడు, గతంలో విప్రోలో పనిచేశాడు. సోహన్ అలియాస్ శ్రీధర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. గుంటూరు జిల్లా లోని ఒక పెద్ద రైతు కుటుంబానికి చెందిన యువకుడు. గుంటూరులోని జేకేసీసీలో బీసీఏ కంప్యూటర్స్ చదివాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఎస్‌ఆర్ నగర్‌లో వెంకటేశ్వరా బాలుర హాస్టల్‌ను నిర్వహించాడు. 2021లో ఓలా డ్రైవర్‌గా కూడా పనిచేశాడు.
తర్వాత అమీన్‌పూర్‌లో ఇసుక సరఫరా వ్యాపారం చేశాడు. 2022లో అతను విప్రోలో సంవత్సరానికి 1.8 లక్షల ప్యాకేజీతో నాన్ ఐటి ఉద్యోగంలో చేరాడు. విలాసాలకు అలవాటు పడిన నిందితుడు వచ్చే జీతం సరిపోదని సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీనికి డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశాడు. అమరావతికే చెందిన తన స్నేహితుడు హర్ష బెంగళూరులో ఉంటున్నాడు, అతడిని సంప్రదించగా అతడు గుంటూరు జిల్లాకు చెందిన వివేక్‌ను పరిచయం చేశాడు. వివేక్ డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన సరఫరాదారు అయిన ప్రకాశం జిల్లాకు చెందిన సోహన్ అలియాస్ శ్రీధర్‌ను (బెంగళూరులోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుతున్నాడు) పరిచయం చేశాడు. కొది నెలల క్రితం బెంగళూర్ వెళ్లి సోహన్ అలియాస్ శ్రీధర్ నుండి 20 గ్రాముల ఎండిఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు వచ్చాడు.
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత 5 గ్రాముల డ్రగ్స్‌ను తీసుకున్నాడు, మిగతా డ్రగ్స్‌ను విక్రయించాలని ప్లాన్ వేశాడు. కొనుగోలు చేసే వారి కోసం ప్రయత్నం చేస్తుండగానే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఇన్స్‌స్పెక్టర్లు నాగేంద్రబాబు, రమణా రెడ్డి తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.