భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ఎక్స్ వేదికగా ప్రకటించింది. వయసు కేవలం ఒకసంఖ్య మాత్రమే అనడానికి ఈ 99 ఏళ్ల బామ్మే నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి భారత్‌కు చెందిన దైబాయి అమెరికా పౌరసత్వం పొందడానికి చాలా ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు ” అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దైబాయి కొన్నాళ్లుగా తన కుమార్తెతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు.
యూఎస్‌సీఐఎస్ వలసదారుల వీసా పిటిషన్లు, సహజీకరణ దరఖాస్తులు, గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను మంజూరు చేస్తుంది. అమెరికాలో పనిచేయడానికి వందల మంది భారతీయ టెక్కీలు ఉపయోగించే హెచ్1బీ వీసాల వంటి వలసేతర తత్కాలిక ఉద్యోగులకు సైతం ఈ ఏజెన్సీ సహకరిస్తుంది. దైబాయికి పౌరసత్వం లభించిందని పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు.