రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్యనందిత
సోదరికే టికెట్ ఖరారు ఉగాది తరువాత
అధికారిక ప్రకటన ముఖ్యులతో కెసిఆర్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా లా స్య నందిత సోదరి నివేదితకు పార్టీ టికెట్ దాదాపు ఖరారయ్యింది. అ యితే ఉగాది తర్వాత నివేదిత పేరును అధికారికంగా ప్రకటించనున్న ట్లు తెలిసింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై ఆదివారం నాడు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ భేటీలోనే బిఆర్‌ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థిని నివేదితగా ఖరారు చేశారు.
దివంగత ఎంఎల్‌ఎ లాస్య నందిత సోదరి నివేదిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్‌ఎగా ఉప ఎన్నికలలో ఉంటానని గత నెలలోనే చెప్పారు. ఈ విషయంపై కెసిఆర్‌తో చర్చిస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా సాయన్న కుటుంబం ఎంఎల్‌ఎగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అన్ని పార్టీలు ఉపఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ఆమె కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నారాయణ శ్రీ గణేశ్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటనను ఎఐసిసి అధికారికంగా చేసింది. మరి బిజెపి మాత్రం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.