న్యూఢిల్లీ : ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సోమవారం ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఏడాది సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన. అరుదైన ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రజలు చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నా, అంతరిక్షంలో ఉన్న మన “ఆదిత్య” మాత్రం చూడలేదట. ఆదిత్య ఎల్ 1 ను ఉంచిన స్థానమే దీనికి కారణం అని చెబుతున్నారు. సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.
దీంతో గ్రహణ ప్రభావం లేకుండా ‘ఆదిత్య ఎల్ 1’ కు సూర్యుడు ప్రతిక్షణం కనిపిస్తాడు. సాధారణంగా సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే నేటి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసే చంద్రుడు ఈ శాటిలైట్‌కు వెనుకవైపు ఉంటాడు. అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో అన్నమాట. అందుకే గ్రహణ ఘట్టాన్ని ఆదిత్య ఎల్ 1 వీక్షించలేదని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. అయితే గ్రహణ సమయంలో సూర్య కిరణాల ప్రభావం ఎలా ఉండనుందనే విషయాలను ఈ మిషన్ పరిశీలించనుంది.
క్రోమోస్పియర్ , నక్షత్రాల కరోనాను మరింత అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఆదిత్య ఎల్1 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు రోదసీలో ప్రయాణించిన శాటిలైట్…. ఈ ఏడాది జనవరిలో భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 ను చేరుకుంది. దాని చుట్టూ ఉన్న కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనాలు సాగిస్తోంది.