న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతులను మార్చాలని డిమాండు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వెలుపల 24 గంటల ధర్నా చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ), ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధిపతులను మార్చాలని డిమాండు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 10 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ పూర్తి బెంచ్‌ను కలిసింది.
ప్రతినిధి బృందంలో డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్, సాకేత్ గోఖలే, సాగరికా ఘోస్ ఉన్నారు. తమ డిమాండును ఎన్నికల కమిషన్‌కు తెలియచేశామని, తమ డిమాడును సాధించేందుకు 24 గంటల ధర్నా చేపట్టామని ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల విలేకరులకు డోలా సేన్ తెలిపారు. కాగా..ధర్నా చేస్తున్న నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.