Monday, December 23, 2024

ఆమెకు ఏదీ అందలం?

- Advertisement -
- Advertisement -

‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్నది ఆర్యోక్తి. స్త్రీకి భారతీయ సమాజం పురాణ కాలం నుంచీ ఎంతో గౌరవాన్నీ, ప్రాముఖ్యతనూ ఇస్తూ వచ్చింది. ఆడది లేకపోతే సృష్టే లేదు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవాళ్లు ఇప్పుడు విద్యాధికులై చట్టసభల్లో సభ్యులవుతున్నారు. ఆకాశాన లోహ విహంగాలను ఇట్టే నడుపుతున్నారు. దేశాధినేతలై ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. అయినా ఎక్కడో ఏదో వెలితి. ఏ రంగంలోనైనా తమకు సాటిలేదంటూ ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలు కనబరిచే స్త్రీలకు కొన్ని సందర్భాల్లో అవకాశాలు మృగ్యమవుతున్నాయి. అందుకు చట్టసభలను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ మహిళను మాటల్లో అందలానికెక్కించే పురుష పుంగవులు చేతల విషయానికి వచ్చేసరికి ఆమెపట్ల వివక్ష కనబరుస్తున్నారు. చట్టసభల్లో మహిళా బిల్లు గట్టెక్కడానికి పాతికేళ్లకు పైగా సమయం పట్టిందంటే మన నాయకమ్మన్యుల ఉదాసీనత ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1996లో మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు సైతం బిల్లును ఒడ్డున పడేసేందుకు ప్రయత్నించినా, కలసిరాని చట్టసభ సభ్యుల పుణ్యమాని ఆమోదానికి నోచుకోలేదు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో ఆరు నెలల క్రితం లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు గట్టెక్కి, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేయించుకుంది.

ఇంత జరిగినా ఈ బిల్లు 2029 ఎన్నికల నాటికి గానీ అమలయ్యే సూచనల్లేవు. ఈ జాప్యానికి జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను కారణంగా చెప్పుకోవచ్చు. బిల్లు ఆమోదం పొందినా, అమలయ్యేది మరో ఐదేళ్లకు కాబట్టి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయా పార్టీలు మహిళలకు సంఖ్యాపరంగా ఎక్కువ సీట్లు కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. మహిళా బిల్లు ఆమోదానికి చొరవ చూపిన భారతీయ జనతా పార్టీ సైతం ఈసారి మహిళలకు అరకొరగానే సీట్లు కేటాయించడం అందుకు ఉదాహరణ. ఇప్పటి వరకూ బిజెపి 419 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న మహిళల సంఖ్య 67 (16%) మాత్రమే. కాబట్టి, మిగిలిన పార్టీలు ఉదారంగా టికెట్లు ఇస్తాయన్న ఆశలు లేనట్టేనని చెప్పవచ్చు. అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగిన ఉత్తరప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, మొదటి దశ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న 80 మంది అభ్యర్థులలో ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారంటే సీట్ల కేటాయింపులో రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు.

సార్వత్రిక ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమేపీ పెరుగుతోందన్నది కాదనలేని వాస్తవం. 1957 లోక్ సభలో 4.5 శాతం మంది మహిళలు మాత్రమే ఉంటే ఆ సంఖ్య 2019 నాటికి 14.4 శాతానికి పెరిగింది. అయితే దేశ జనాభాలో మహిళల సంఖ్యను బట్టి చూస్తే మాత్రం చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అందుకు అనుగుణంగా లేదన్నది నిర్వివాదాంశం. జనాభాలో 48.5 శాతం మహిళలు ఉంటే, లోక్‌సభలో మహిళా సభ్యులు 14 శాతం మాత్రమే ఉండటం చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. రాజకీయాలు నేరపూరితమవుతున్నాయని ప్రజాస్వామికవాదులు, మేధావులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఈ ఒరవడి పెరుగుతోందే తప్ప తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు యథేచ్ఛగా టికెట్లు సంపాదించుకుని, ఎన్నికల బరిలోకి బోర విరుచుకుని దిగుతున్న నేపథ్యంలో, బ్రిటన్‌కు చెందిన వరల్డ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్ సంస్థ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మన దేశంలో జరిపిన ఓ సర్వేలోని వివరాలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మహిళా ప్రజా ప్రతినిధులు సాధారణంగా అవినీతికి, నేరాలకు, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే వారి నియోజకవర్గాల్లో ఆర్థికాభివృద్ధి కూడా ఎక్కువేనని తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూస్తే, మంచి కాలం ముందుందని అనిపించక మానదు. డీలిమిటేషన్, జనగణన వంటి ప్రక్రియలను పూర్తి చేసుకుని 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలయితే, భారత నారీశక్తి ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి తేటతెల్లమవుతుందనడంలో సందేహం లేదు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News