Saturday, December 21, 2024

మహబూబాబాద్ బరిలో మళ్లీ పాత కాపులే!

- Advertisement -
- Advertisement -

పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్,  పాగా వేయాలని బిజెపి తహతహ
ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు,  ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్న నేతలు

ముగ్గురూ పాత కాపులే. ఒక్కొక్కరు ఒక్కోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఖరారు కావడంతో ఎన్నిక ఆసక్తి కలిగిస్తున్నది. 2009, 2014, 2019లో మూడుసార్లు జ రిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కోసారి ఎన్నికయ్యా రు. మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థిత్వాలు తేలడంతో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌టిలకు రిజర్వ్ స్థానమైన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ రసవత్తరంగా మారనున్నది. బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మాలోత్ కవితకు ఆ పార్టీ మరోమారు టికెట్ కేటాయించింది.

కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పో రిక బలరాం నాయక్ అభ్యర్థిగా ఖరారయ్యారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంపి సీతారాం నాయక్‌ను పార్టీలోకి తీసుకొని బిజెపి తమ అభ్యర్థిగా ప్రకటించిం ది. ఈ ముగ్గురు కూడా నియోజకవర్గానికి పాత కాపులే కావడంతో పోటీ ఆసక్తి గొల్పుతున్నది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు అసెంబ్లీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టిఆర్‌ఎస్ జెండా పాతింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

మూడు ఎన్నికల్లో ఆ ముగ్గురే…
మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి 2009 నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే… 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎంపిగా ఎన్నికయ్యారు. అప్ప టి టిడిపి అభ్యర్థి మోహన్ లాల్ పై భారీ విజయా న్ని అందుకున్నారు. కేంద్రంలో ఏర్పడ్డ యుపిఎ-2 లో బలరాం నాయక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాం గ్రెస్ ద్వారా తెలంగాణ కోసం ఉ ద్యమించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన త ర్వాత తొలిసారిగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిఆర్‌ఎస్ విజ యం దక్కించుకున్నది.

కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ సీతా రాం నాయక్ విజయం సాధించారు. 2019లో జరిగిన పార్లమెం టు ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపి సీతారాం నాయక్‌ను కాదని, టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మా లోత్ కవితను అధిష్ఠానం బరిలోకి దించింది. అప్పటికే రాష్ట్రం లో టిఆర్‌ఎస్ హవా ఉండటంతో కాంగ్రె స్ అభ్యర్థి బలరాం నాయక్‌పై ఆమె విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బల రాం నాయక్, బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి కవిత, బిఆర్‌ఎస్ మాజీ ఎంపి సీతారాం నాయక్ బిజెపి నుంచి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మూడు ఎన్నికల్లో విజ యం సాధించిన ముగ్గురు వ్యక్తులే ఈసా రి మళ్లీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.

ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు
పార్లమెంట్ ఎన్నికల్లో తలపడుతున్న ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వాన్ని ప్రారంభించి, స్పీడ్ పెంచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఇదే ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో పర్యటనలు సాగిస్తున్నది. భద్రాచలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొని అభ్యర్థి బలరాం నాయక్‌కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన మంత్రి సీతక్క కూడా బలరాం నాయక్‌తో కలిసి విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. అదేవిధంగా బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి మాలోత్ కవిత కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రులు రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్‌తో కలిసి మరిపెడ నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి నేతలు ఫిరాయిస్తున్నా కేడర్‌తో మమేకం అవుతున్నారు. బిజెపి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా పార్టీ శ్రేణులు కలుపుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. ముగ్గురికి కూడా నియోజకవర్గంలో పట్టు ఉన్నప్పటికీ ఎవరికి వారే తమ పట్టును మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందరిలో ఆశలు.. పీఠం ఎవరికి దక్కేనో
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు కూ డా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఒకరేమో సానుభూతి.. మరొకరేమో పార్టీ హవా… ఇంకొకరేమో బలీయమైన కేడర్ ఉందనే నమ్మకంతో ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉ న్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ రెండుసార్లు ఓటమిపాలైనా పార్టీ కేడర్‌తో మమేకమై పనిచేస్తున్నారు. 2018లో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికి కేడర్‌తో ఉన్నారు. 2023 లో మహబూబాబాద్ అసెంబ్లీ సీటు ఆశించి భం గపడ్డారు. తనకు సానుభూతితో పాటు కాంగ్రెస్ హవా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏ డో అసెంబ్లీలో ఆరుచోట్ల కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇది కూడా తనకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.

బిజెపి అభ్యర్థి సీతా రాం నాయక్ మాత్రం ప్రధాని మోడీ హవాను నమ్ముకున్నారు. గతంలో టిఆర్‌ఎస్ ఎంపిగా పనిచేసినందున అప్పటి కేడర్ కూడా తనకు ఈ ఎన్నికల్లో సహకరిస్తుందని ఆయన అభిప్రాయప డుతున్నారు. మరోసారి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నందున లాభిస్తుందని బిజెపి అంచనా వేస్తున్నది. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మాత్రం క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న కేడర్‌ను నమ్ముకుంటున్నది. పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండ డం…గతంలో ఎంఎల్‌ఎగా పనిచేయడం, తండ్రి మాజీమంత్రిగా ఉండడంతో అన్ని కలిసి వస్తాయని ఆశిస్తున్నారు.

కలవరపెడుతున్న ఆదివాసీల ఆందోళన
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదివాసీల ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవ రపెడుతున్నది. అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న తమను పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈసారి కూడా అవకాశం ఇవ్వలేదంటూ ఆదివాసీలు ఆందోళన చేపడుతున్నారు. మూడు ప్రధాన పార్టీ లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్లు కట్టబెట్టాయని ఆరోపిస్తున్నారు.

ఈసారి తాము ఎన్నికల బరిలో నిలుస్తామని చెబుతున్నా రు. ఈ పరిణామం రాజకీయ పార్టీలను కలవరపరుస్తున్నది. నియోజకవర్గంలో దాదాపుగా నా లుగు లక్షల ఓట్లు ఆదివాసీలవే ఉంటాయని చె బుతున్నారు. ఇప్పటికే కొందరు ఆదివాసీ నేతలు ఎన్నికల రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబం ధం లేకుండా ఎన్నికల బరిలో దిగుతామని చెబుతున్నారు. ఆదివాసీలు తెరమీదకు రావడంతో పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సి ఉంది.

వల్లాల వెంకటరమణ
వరంగల్ ప్రత్యేక ప్రతినిధి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News