ముంబై: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. ముంబై నాలుగు మ్యాచుల్లో ఒకదాంట్లో మాత్రమే నెగ్గగా, బెంగళూరు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు పరాజయాలను చవిచూసింది. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. కిందటి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలవడంతో ముంబై ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. అయితే సమష్ఠిగా రానించడంలో విఫలమవుతుండడంతో వరుస ఓటములు తప్పడం లేదు.
సవాల్ వంటిదే..
ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న బెంగళూరును ఓడించాలంటే సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. కిందటి మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించడంతో జట్టుకు కాస్త ఊరట లభించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు కిందటి మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం అందించారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ముంబైకి భారీ స్కోరు కష్టమేమీ కాదు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా ఫామ్‌ను అందుకున్నాడు. తిలక్ వర్మ కిందటి మ్యాచ్‌లో విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్‌లు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. షెఫర్డ్ అయితే 10 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డేవిడ్ కూడా 21 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
తీవ్ర ఒత్తిడిలో ఆర్‌సిబి..
మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న బెంగళూర్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో బలమైన ముంబైతో పోరు జట్టుకు సవాల్‌గా మారింది. విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్‌లు తప్ప మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. సారథిగా కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోతుంది. బౌలింగ్‌లో కూడా సిరాజ్ పూర్తిగా తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై భాగానే ప్రభావం చూపుతుంది. యశ్ దయాళ్ ఒక్కడే కాస్త మెరుగైన బౌలింగ్‌ను కనబరుస్తున్నాడు. మిగతా వారు పెద్దగా రాణించలేక పోతున్నారు. ఇది కూడా జట్టు ఓటములకు ఒక కారణంగా చెప్పాలి. అయితే ముంబైతో జరిగే మ్యాచ్ లో గెలిచి మళ్లీ గాడిలో పడాలనే పట్టుదలతో బెంగళూరు ఉంది.