Sunday, January 12, 2025

పెద్ద మనిషితనం లేని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఎవరి మీదైనా విమర్శలు చేయవచ్చు. ఎన్నికల సమయంలో ఆ వెసులుబాటు మరింత ఉంటుంది. అదే సమయంలో, పార్టీ శ్రేణులు ఏమి మాట్లాడినా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వారికి తగినంత సంయమనం అవసరం. మొత్తం దేశానికి ప్రధానమంత్రి అయిన నాయకుని గురించి అయితే ఇక చెప్పనక్కరలేదు. తను పూర్తిగా పెద్ద మనిషి తరహాలో ఉండాలి. ఇతరులు తనను చూసి సంయమనం అంటే ఏమిటో, సమతులనమైన ప్రజాస్వామిక విమర్శలు ఎట్లా ఉండాలో నేర్చుకోవాలి. ఆ విధంగా తను ఒక గురువు, ఆదర్శప్రాయుడు కావాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినందున భారత ప్రధాని తీరును ప్రపంచ దేశాలన్నీ గమనిస్తుంటాయి. ఆయన తీరును బట్టి తన పట్ల, దేశ ప్రజాస్వామ్యం పట్ల ఇతరుల గౌరవం కనీసం కొంత వరకు ఆధారపడి ఉంటుంది. భారత ప్రజలకు కూడా అగ్రనేతపైనే గాక ప్రజాస్వామ్యంపై కూడా గౌరవ విశ్వాసాలు ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

ప్రధాన మంత్రి మోడీ ఎన్నికల ప్రచార సందర్భంలో మాట్లాడుతున్న తీరు ఆయన గౌరవ మర్యాదలను పెంచే విధంగా లేదు.
దేశానికి మోడీ కన్న ముందు 15 మంది ప్రధాన మంత్రులుగా పని చేశారు. వారిలో బలవంతులు, బలహీనులు, శక్తివంతులు, శక్తిహీనులు ఉంటే ఉండవచ్చుగాక. కాని పెద్ద మనుషులవలె వ్యవహరించనివారు ఒక్కరైనాలేరు. అందరినీ దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా కూడా గౌరవప్రదంగానే చూసింది. ఆ 15 మందిలో అనేకులు ఎన్నికలు ప్రచారాలలో పాల్గొన్నావారే. కాని ఎవరి ప్రచార ధోరణి కూడా మోడీ వలె లేదన్నది గుర్తించవలసిన విషయం.ఈ సందర్భంలో మోడీ పార్టీ బిజెపికే చెందిన వాజపేయి, అద్వానీ గుర్తుకు వస్తారు. ఆ పార్టీ సిద్ధాంతాలతో, ఆ ఇద్దరు నాయకుల విమర్శలతో ఇతర పార్టీలు తీవ్రంగా విభేదించి ఉండవచ్చుగాక. కాని వారి విమర్శనా శైలిని గాని, భాషను గాని, ప్రచార ధోరణులను గాని ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవప్రదమైన వాటిగా, ప్రజాస్వామికమైనవిగా గుర్తించారు. ఆ ఇద్దరు నాయకులకు కూడా వ్యక్తిగతంగా దేశవిదేశాలలో అటువంటి గౌరవం లభించింది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన రాజకీయ జీవితంలో వారినెవ్వరూ అప్రజాస్వామికులని విమర్శించలేదు.

కాని మోడీ పద్ధతి ఇంతకు ముందటి 15 మంది ప్రధాన మంత్రులవలె గాని, ఆయన పార్టీకే చెందిన ఇద్దరు నాయకుల వలెగాని లేదు. మోడీని ఈ దేశపు అత్యంత శక్తివంతమైన ప్రధానులలో ఒకరిగా పరిశీలకులు భావిస్తుంటారు. కేవలం రాజకీయ కోణం నుంచి చూసినట్లయితే లేదా శక్తివంతంగా పరిపాలించటం అనే కోణం నుంచి చూసినా ఆ మాట నిజమే కూడా. అయితే, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అటువంటి శక్తి గల నాయకుడు తన రాజకీయమైన, పరిపాలన పరమైన వ్యవహరణలోనూ బలమైన ప్రజాస్వామిక ధోరణులనే చూపాలి. ఉదాహరణకు నెహ్రూ వలె. బిజెపికి ప్రీతిపాత్రుడైన అగ్రశేణి నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్‌ను గాని, ఆ సంస్థ విదేశాలలో ప్రకటించిన ప్రవాస ప్రభుత్వాన్ని గాని ఎంత ప్రజాస్వామికంగా నిర్వహించారో తెలిసిన విషయమే.

కాని మోడీకి గత ప్రధానులు గాని, తమ పార్టీ అగ్రనేతలు గాని, సుభాష్ బోస్ వంటి వారు గాని ఎవరూ ఆదర్శప్రాయులైనట్లు కన్పించదు. ఆయన తనకు తానే ఆదర్శంగా మారారు. మునుముందు మరెవరైనా తనను ఆదర్శంగా తీసుకోగలరేమో అన్నదే భయం. మోడీ ఇటువంటి ప్రతిష్ఠను సంపాదించినందు వల్లనే భారత దేశానికి ఈ రోజున గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ఎన్నికైన నియంతృత్వం’ (ఎలెక్టెడ్ ఆటోక్రసీ) అనే పేరు ప్రపంచంలో వచ్చింది. ఆ విధంగా ప్రపంచంలోని మరికొన్ని ఎన్నికైన నియంతృత్వాల సరసన నిలబడి, ప్రజాస్వామిక ర్యాంకింగ్స్‌లో ఇండియాను 105వ స్థానానికి చేర్చిన ఘనత మోడీకి చెందుతున్నది.
విషయం ఏమంటే, ఈ విధమైన ధోరణి అంతా నరేంద్ర మోడీ ప్రస్తుతం సాగిస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళిలో కన్పిస్తున్నది. ఇతర పార్టీలపై చేస్తున్న విమర్శలు, అసంబద్ధమైన తీవ్ర ఆరోపణలు, తను ఉపయోగిస్తున్న భాష, ప్రదర్శిస్తున్న హావభావాలలో ఇదంతా ప్రతిఫలిస్తున్నది.

అదే విధంగా ప్రత్యక్ష సంబంధం లేదనిపించవచ్చు గాని మోడీ విస్తృత అధికార వ్యూహంతో విడదీయలేని సంబంధం గల విషయం మరొకటి ఉంది. అది, ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ కక్ష పూనినట్లు నిస్సందేహకరంగా కనిపిస్తున్న దర్యాప్తు ఏజెన్సీల దాడులు, ఇతర పార్టీలను చీల్చటాలు, బిజెపిలో చేరిన వారిపై కేసుల నిలుపుదల లేదా మాఫీలు. ఎన్నికల సమయంలో ఇది మరింత పెరగటమన్నది గమనించవలసిన మాట. దీనిపై మోడీ అ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా మారి చివరకు ఐక్యరాజ్య సమితి సైతం ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం గురించి ఆ సంస్థ మాకు పాఠాలు చెప్పనక్కరలేదంటూ విదేశాంగ మంత్రి జై శంకర్ ఈసడించవచ్చుగాక. కాని అటువంటి సంస్థ వ్యాఖ్యలు మోడీని ప్రపంచానికి పెద్ద మనిషిగా చూపవని ఆయనకు తెలియనిది కాదు. ఇందువల్ల మన ప్రజాస్వామ్యపు ర్యాంకు 105 నుంచి మరింత పతనమైతే ఆశ్చర్యపడవలసింది ఉండదు.

ఇదంతా స్వతంత్ర భారతపు 75 సంవత్సరాల చరిత్రలో గాని, గత 15 మంది ప్రధానుల కాలంలో గాని, మోడీ పార్టీకే చెందిన వాజపేయి పాలనలో గాని జరగని విషయం. ఆయన ఎన్నికల ప్రచారం నుంచి కొన్ని ఉదాహరణలను చూద్దాం. తను ఈ నెల 8న చత్తీస్‌గఢ్‌లో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ పేదల అవసరాలను పట్టించుకోలేదని, అవినీతిమయంగా మారిందని అన్నారు. దీనితో ఆక్షేపించవలసిందేమీ లేదు. కాని అంతకు రెండు రోజుల ముందు ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలీగ్, మార్కిస్టు ఆలోచనలు ఉన్నాయన్నారు. ఇందులో అభ్యంతరకరమైన మాటలు, పెద్ద మనిషి తరహాలో లేనివి, చివరకు చరిత్ర తెలియనివి కూడా ఉన్నాయి. ముందుగా గమనించ వలసిందేమంటే, ఆయన ఇటువంటి తీవ్రమైన నిందలైతే అలవోకగా చేశారు గాని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ లక్షణాలు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు తెలిసేందుకు ఒక్కటుంటే ఒక్క అంశాన్ని అయినా ఎత్తి చూపలేదు. కనీసం తర్వాత రెండు రోజులలోనైనా ఎక్కడా వివరించలేదు. నిజానికి అటువంటి లక్షణాలు అనదగ్గవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవీ లేవు.

మోడీ తన ఆరోపణలు చేసింది తాము హిందువులను మరింత రెచ్చగొట్టి ఓట్లు సంపాదించజూస్తున్న ఉత్తరప్రదేశ్‌లోనన్నది గమనించవలసిన విషయం. అయితే ఇటువంటి ప్రచారాల వల్ల జరిగేది కేవలం మరిన్ని ఓట్లు రావటం కాదు. ఇప్పటికే విషప్రాయంగా మారిన రెండు మతా ల సామాజిక సంబంధాలు, శాంతిభద్రతల సమస్యలు మరెంత చేజారవచ్చునో ఎవరైనా ఊహించగలరు. ఇటువంటి పని ఒక ప్రధాన మ్రంతి చేయవలసినదేనా? సరిగా ఇటువంటి ప్రచారాలనే ఆయన వేర్వేరు మాటలలో, అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు తగినంత గల రాష్ట్రాలలో, ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలలో సాగిస్తున్నారు. ఇక మార్కిస్టు లక్షణాలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయనటం పెద్ద హాస్యాస్పదమైన ఆరోపణ. ఎందుకో కూడా చెప్పనక్కరలేదు.

దక్షిణాదిన బలహీనంగా గల బిజెపికి కొద్ది స్థానాలు గెలవటం కోసం మోడీ ముఖ్యంగా తమిళనాడు, కేరళలో ఇదే విధంగా మతపరమైన రంగు గలవి, జాతీయ ప్రయోజనాలంటూ చెప్పగల కచ్చతీవు వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజలను రెచ్చగొట్టజూస్తున్నారు. కచ్చతీవుపై స్వయంగా జైశంకర్ కొన్నేళ్ల క్రితం ఇచ్చిన సమర్థనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ఆ ఒప్పందాన్ని డిఎంకె, ఇతర తమిళపార్టీలు అప్పుడే వ్యతిరేకించటంపై రికార్డులు కూడా ఉన్నాయి. కనుక, వీటన్నింటిని బట్టి అర్ధమయేదేమిటి? వరుసగా మూడవసారి ప్రధాని కాగోరుతూ, తమ ఎన్‌డిఎ కూటమికి 400 స్థానాలు సాధించజూస్తున్న మోడీ, గతంలో ఏ నాయకుడు, ఎప్పుడూ చేయని విధంగా పెద్ద మనిషితనాన్నంతా గాలికి వదలివేశారన్న మాట.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News