Friday, November 22, 2024

కశ్మీరులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

దశాబ్దాల తర్వాత ఉగ్రవాద భయం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు
మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెలబెట్టుకున్నాను
జమ్మూ కశ్మీరులో కనిపిస్తున్న అభివృద్ధి
ఆర్టికల్ 370 పునరుద్ధరణ అసాధ్యం
ఉధంపూర్ సభలో ప్రధాని మోడీ

ఉధంపూర్(జమ్మూ కశ్మీరు): జమ్మూ కశ్మీరులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఈ ప్రాంతానికి త్వరలో రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఉధంపూర్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నకేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తరఫున శుక్రవారం ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. నన్ను నమ్మండి..గడచిన 60 ఏళ్లుగా జమ్మూ కశ్మీరును పట్టిపీడిస్తున్న సమస్యలను నిర్మూలిస్తా..అంటూ మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఉగ్రవాద భయం, దాడులు, రాళ్ల దాడి, సీమాంతర కాల్పులు లేకుండా అనేక దశాబ్దాల తర్వాత జమ్మూ కశ్మీరులో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఉధంపూర్‌లో జమ్మూ కశ్మీరు ప్రజల కష్టాలకు ముగింపు పలుకుతానన్న వాగ్దానాన్ని తాను నెరవేర్చుకున్నానని తెలిపారు. 2019లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన రాజ్యాంగంలోని 370వ అధికరణను జమ్మూ కశ్మీరులో పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ప్రకటనను ఆయన సవాలు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా తాను జమ్మూ కశ్మీరుకు వస్తున్నానని, లాల్ చౌక్(శ్రీనగర్ నడిబొడ్డు) వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి 1992లో తాము జరిపిన ఏక్తా యాత్ర ఇప్పటికీ తనకు గుర్తు ఉందని మోడీ చెప్పారు.

తమకు అప్పట్లో ఘన స్వాగతం లభించిందని, 2014లో వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడే ఇదే వేదిక నుంచి తాను ప్రసంగించానని, దశాబ్దాల వేదన(ఉగ్రవాదం కారణంగా) నుంచి విముక్తి కలిగిస్తానని జమ్మూ కశ్మీరు ప్రజలకు తాను వాగ్దానం చేశానని ప్రధాని గుర్తు చేశారు. ప్రజల ఆశీస్సులతో తన వాగ్దానాన్ని నెరవేర్చానని ఆయన చెప్పారు. దశాబ్దాల తర్వాత..ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాళ్ల దాడి, దాడులు, సీమాంతర ఉగ్రవాదం వంటి భయాలేవీ లేకుండా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు అవేవీ ఎన్నికల అంశాలు కావని ఆయన అన్నారు. వైష్ణోదేవి, అమరనాథ్ యాత్రల భద్రతకు సంబంధించి గతంలో భయాందోళనలు ఉండేవని, అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోడీ తెలిపారు.

జమ్మూ కశ్మీరు అభివృద్ధిని చూస్తోందని, ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం బలపడుతోందని ఆయన అన్నారు. 370వ అధికరణను తిరిగి జమ్మూ కశ్మీరులో అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల హామీని ఆయన తప్పుపట్టారు. అది వారికి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నన్ను నమ్మండి. గత 60 ఏళ్లుగా జమ్మూ కశ్మీరును పట్టి పీడిస్తున్న సమస్యలను అంతం చేస్తాను. గత పదేళ్లలో జమ్మూ కశ్మీరును సంపూర్ణంగా మార్చివేస్తానన్న నా వాగ్దానాన్ని నెరవేర్చాను అని ప్రధాని పేర్కొన్నారు. ఉధంపూర్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూ నుంచి పోటీ చేస్తున్న జుగల్ కిశోర్‌లను గెలిపించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మద్దతు ఇవ్వాలని ఆయన జమ్మూ కశ్మీరు ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News