Saturday, November 23, 2024

అంచనాలను అందుకుంది..

- Advertisement -
- Advertisement -

గతేడాదితో పోలిస్తే 9% పెరిగిన లాభం
షేరుకు రూ.28 డివిడెండ్ ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఐటి కంపెనీ టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మార్చి ముగింపు నాటి క్యూ4 ఫలితాల్లో అంచనాలను రాణించిం నాలుగో త్రైమాసికం (జనవరి నుంచి మార్చి) కాలంలో టిసిఎస్ లాభం 9 శాతం పెరిగి రూ.12,434 కోట్లకు చేరుకుంది. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.11,392 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

త్రైమాసిక ప్రతిపాదికన అంటే క్యూ3తో పోలిస్తే సంస్థ లాభం 12.44 శాతం పెరిగింది. టిసిఎస్ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.28 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. క్యూ4లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3.5 శాతం పెరిగి రూ.61,327 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఇంకా టిసిఎస్ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 13.2 బిలియన్ డాలర్ల విలువైన రికార్డు ఒప్పందాలను పొందింది.

దీంతో ఆర్థిక సంవత్సరంలో మొత్తం కాంట్రాక్ట్ విలువ 42.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది చారిత్రాత్మక గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఫలితాలపై టిసిఎస్ సిఇఒ, ఎండి కె.కృతివాసన్ స్పందిస్తూ, 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా బుక్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆపరేటింగ్ మార్జిన్‌లో 26 శాతం పెరుగుదల ఉందని, ఇది మా వ్యాపార నమూనా, దానిని అమలు చేయడంలో మా సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

ఉద్యోగుల జీతాల పెంపు
టిసిఎస్ తన ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల జీతాలు పెంచారు. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నుంచి బయటకి వెళ్లిన ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతకుముందు త్రైమాసికంలో 13.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 12.5 శాతానికి తగ్గింది. నాలుగో త్రైమాసికంలో టిసిఎస్ శ్రామికశక్తి 6,01,546గా ఉంది, అందులో 35.6 శాతం మహిళలు ఉన్నారు. కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ, అట్రిషన్ రేటు తగ్గింపు, క్యాంపస్ నియామకాలకు బలమైన స్పందన, కస్టమర్ సందర్శనల పెరుగుదల సానుకూల ప్రభావం చూపాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News