Friday, December 20, 2024

మండుటెండల మరణాలను ఆపలేమా?

- Advertisement -
- Advertisement -

దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి వెలువడిన ఆ నివేదిక తెలియజేసింది. ఉష్ణోగ్రతల్లో వస్తున్న అసాధారణ మార్పుల వల్ల ఎండలు మనిషి భరించలేని స్థితికి చేరడం చావులకు దారి తీస్తున్నదని ఆ నివేదిక విశ్లేషించింది. చైనాలోని జింగియా ఆస్పత్రికి చెందిన క్వాన్ చెంగ్ నేతృత్వంలో ఎండలపై ప్రపంచంలో మూడు దశాబ్దాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు, చావులపై నిర్వహించిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా పేరున్న వైద్య పత్రికల్లో ఒకటైన న్యూరాలజీ జర్నల్‌లో పరిశోధన ఫలితాలు ప్రచురించారు. ఇవి ఒక భారత్‌నే కాకుండా ప్రపంచాన్ని కూడా మేల్కొలిపాయి. జబ్బులతో కాకుండా చివరకు వాతావరణంలో వచ్చే మార్పులతో సంభవించే మరణాలను నియంత్రించే ఆధునిక వైద్య విధానాలను పరిశోధకులు కనుగొని మానవాళికి అందించాలని ఆ నివేదిక సూచించింది. భారతదేశంలో 2019లో 33 వేల మంది అసాధారణ ఎండలతో చనిపోతే, ఇందులో 18 వేల మంది (55 శాతం) సాధారణం కంటే అత్యధికంగా ఎండ వేడి కారణంగా మరణించారని, మరో 15 వేల మంది (45 శాతం) ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోవడం మూలంగా చనిపోయారని నివేదిక వివరాలు వెల్లడించాయి. ఎండ వేడి చావులకు ఎక్కువగా పురుషులు బాధితులవుతున్నారని నివేదిక పేర్కొనడం గమనార్హం. ప్రపంచంలోని 204 దేశాలు, ప్రాంతాల్లో పరిశోధనను నిర్వహించారు.

దక్షిణాసియాలో భారత్‌పై ప్రభావం ఎక్కువగా ఉండగా, అత్యధికంగా మధ్య ఆసియాలో ఎండ మంటలకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని పరిశోధన వివరాల్లో వెల్లడైంది. లక్షమంది పురుష జనాభాలో 7.7 శాతం ఎండలకు బాధితులవుతుండగా, మహిళలకు లక్ష జనాభాకు 5.9 శాతంగా ఉన్నది. అదే మధ్య ఆసియాలో లక్ష జనాభాకు 18 శాతం ప్రజలు ఎండలకు మాడిపోతున్నారని నివేదిక పేర్కొన్నది. నివేదికలోని అంశాలు భూతాపాన్ని అరికట్టడం కూడా పాలకుల ఎజెండాలో అగ్ర భాగానికి చేర్చాల్సిన అనివార్య పరిస్థితిని తెలియజేస్తున్నది. ఇప్పటివరకు వాతావరణ మార్పుల్లో అసమతుల్యతను పాలకులు తీవ్రమైన అంశంగా గుర్తించడం లేదు. ప్రపంచమంతటా భూగోళం ప్రతి ఏటా ఒళ్ళు గగుర్పొడిచేలా వేడవుతున్నా దానిని నియంత్రించే విధానాలు రూపు దాల్చడం లేదు.

ఈ ఎండ మంటలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో నెలలో ఒక్కో రూపంలో ఉంటున్నాయి. వాతావరణ సమతుల్యతకు సంబంధించి ఏ దేశానికాదేశం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విధానాలు యుద్ధ ప్రాతిపదికన రూపొందిస్తే తప్ప ఎండ మంటల మరణాలు ఆగవు. భారతదేశంలో ఏప్రిల్, మే, జూన్ 10 దాకా ఎండలు మండుతాయి. కాని ఈ మధ్య కాలంలో ఈ ఎండలు ఫిబ్రవరి నుంచే మండుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 45 డిగ్రీల ప్యారెన్ హీట్‌ను దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో 50 డిగ్రీలకు ఎండలు పెరుగుతాయనే వాతావరణ శాఖ అంచనాలు వింటేనే బెంబేలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది. మే నెల ఎండల గండాన్ని ఎలా తప్పించుకోవాలని అంతా శీతల ప్రదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. వాతావరణ అసమతుల్యత అసాధారణ స్థాయికి చేరడానికి మనుషుల చర్యలే తప్ప మరో కారణం కాదు. దేశమంతటా పచ్చదనాన్ని పెంచడానికి బదులు స్వార్థ ప్రయోజనాల కోసం తుంచుతున్నారు. పల్లెల్లోని గల్లీల నుంచి ఢిల్లీ దాకా పచ్చదనం శాతం రోజురోజుకూ తగ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లేవు.

దీనికితోడు వాయు కాలుష్యం అగ్నికి ఆజ్యంలా తోడై మనుషుల ఆయుః ప్రమాణాలను తెగ్గోస్తున్నది. ఎండల్లో పని కోసం వెళ్ళిన వారు వడగాడ్పుల దెబ్బకు ఎక్కడ పడిపోతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. దేశమంతటా గ్రీనరీ శాతం పెరిగితే తప్ప వాతావరణంలో అసాధారణ మార్పులను ఆపలేని దయనీయ పరిస్థితి కనిపిస్తున్నది. పట్టణీకరణ, ఆకాశ హర్మాలను అభివృద్ధికి సూచికలుగా పాలకులు చూపిస్తున్నారు. కాని అక్కడ ఎంత శాతం గ్రీనరీ ఉంది అనేది చెప్పడం లేదు. అసలు గ్రీనరీ ఛాయల్లేని పట్టణాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నిర్మాణాలకు నిర్దేశిత శాతం గ్రీనరీ ఉంటే తప్ప అనుమతులు ఇవ్వమనే విధానాలు పట్టణ ప్రణాళికల్లో చోటు చేసుకోకుంటే మండు టెండల మంటలు ప్రమాద ఘంటికలను మోగిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎండ వేడిమితో మూడు దశాబ్దాల్లో 5 లక్షల 20 వేల మంది చనిపోవడమో, రోగగ్రస్థులు కావడమో జరిగిందన్న నివేదికను చదివిన తర్వాతనైనా పాలకుల్లో మార్పు రావాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News