Sunday, November 24, 2024

నేడే బిజెపి మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నది. సంకల్ప పత్ర పేరిట బిజెపి మేనిఫెస్టోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన హామీలతోపాటు తమ వికసిత భారత్ లక్ష్యానికి చెందిన రోడ్డు మ్యాపును బిజెపి ఈ మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. కాగా..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడే బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుండడం విశేషం.

ప్రధాని మోడీతోపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తమ సైద్ధాంతిక వాగ్దానాలలో ప్రధానమైన అయోధ్యలో రామాలయ నిర్మాణం, జమ్మూ కశ్మీరులో 370వ అధికరణ రద్దు వంటివి ఇప్పటికే నెరవేర్చడంతో తాజా మేనిఫెస్టోలో బిజెపి తన సాంస్కృతిక, హిందుత్వ అజెండాను ఏ విధంగా పొందుపరుస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ప్రధాని మోడీ తరచు ప్రస్తావించే నాలుగు కులాలు,యువత, మహిళలు, రైతులు, పేదలకు సంబంధించి రానున్న ఐదేళ్లలో తీసుకునే చర్యలను ఈ మేనిఫెస్టోలో వాగ్దానాలుగా చేర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బిజెపి నియమించిన మేనిఫెస్టో కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ప్రజల నుంచి సూచనలను తీసుకోవడానికి దేశవ్యాప్తంగా బిజెపి వ్యాన్లను పంపడంతోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలపై విస్తృతంగా చర్చలు జరిపి మేనిఫెస్టోలో చేర్చినట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News